బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ తో ఆంధ్రప్రదేశ్ తీరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలోని వాయుగుండం పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో మరింత బలపడి ఆదివారం రాత్రికి బలపడే అవకాశం ఉందని అమెరికాకు చెందిన వాతావరణ సంస్థ ప్రకటించింది. ఈ తుఫానుకు మొంథా అని పేరు పెట్టారు. సాధారణంగా ఇలాంటి సమయంలో తుఫాన్లకు ఎవరు పేర్లు పెడతారు? వాతావరణంలో చెప్పే రెడ్, ఆరెంజ్ అలర్ట్ కు అర్థం ఏంటి?
ప్రపంచ వాతావరణ సంస్థ పరిధిలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రాలు తుఫాన్లకు పేర్లు పెడతాయి. అయితే ఇది 13 దేశాలు కలిసి నిర్ణయించిన పేర్ల జాబితా ఆధారంగా ఉంటుంది.ఆ 13 దేశాల్లో ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక, మాల్దీవులు, మయన్మార్, థాయ్‌లాండ్, ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యెమెన్, యుఏఈ, ఓమన్ ఉన్నాయి. ప్రతి దేశం కొన్ని పేర్లను ముందుగానే ఇస్తుంది. తుఫాన్ ఏర్పడినప్పుడు ఆ జాబితాలో వరుసగా ఉన్న పేరును ఉపయోగిస్తారు. ఉదాహరణకు గులాబ్-పాకిస్థాన్, యాస్-ఒమాన్, తౌక్టే-మయన్మార్, నిసర్గ -బంగ్లాదేశ్, మోంథాస్-థాయ్‌లాండ్. ప్రస్తుతం ఉన్న “మోంథాస్” అనే తుఫాన్ పేరును థాయ్‌లాండ్ దేశం ప్రతిపాదించినది.
తుఫాన్లకు పేర్లు పెట్టడం ప్రథమంగా ఆస్ట్రేలియా వాతావరణ శాస్త్రవేత్త “క్లిమెంట్ వ్రాగ్” (Clement Wragge) అనే వ్యక్తి 1890లలో ప్రారంభించాడు.అతను ఆ కాలంలో పసిఫిక్ మహాసముద్రంలో వచ్చే తుఫాన్లకు మహిళల పేర్లు, పురాణాల్లోని పాత్రల పేర్లు పెట్టేవాడు. ప్రపంచవ్యాప్తంగా 1953 నుండి (అమెరికా నేషనల్ వెదర్ సర్వీస్ ద్వారా) తుఫాన్లకు పేర్లు పెట్టడం అధికారికంగా ప్రారంభమైంది. మొదట మహిళల పేర్లను మాత్రమే వాడేవారు, తరువాత 1979 నుండి పురుషుల పేర్లను కూడా చేర్చారు. భారత మహాసముద్రంలో తుఫాన్లకు పేర్లు పెట్టే పద్ధతి 2004లో ప్రారంభమైంది. ఇందులో భారతదేశం, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయ్‌లాండ్ మొదలైనవి. ప్రతి దేశం తుఫాన్ల పేర్ల జాబితా (లిస్ట్) సమర్పిస్తుంది.తుఫాన్ ఏర్పడినప్పుడు వరుసగా ఆ జాబితాలోని పేరు వాడతారు.
తుఫాను పేర్లు పెట్టడానికి కారణం.. ప్రతి తుఫాన్‌ను ప్రత్యేకంగా గుర్తించడం సులభం. హెచ్చరికలు స్పష్టంగా ఇవ్వడానికి.. “తుఫాన్ మోచా” అని చెప్పడం, “ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్” అని చెప్పడానికంటే సులభం. సమాచార మార్పిడికి సౌలభ్యం.. దేశాల మధ్య కమ్యూనికేషన్ సులభతరం అవుతుంది.





