Monday, March 16, 2026

పద్మవ్యూహం నిర్మాణం ఎలా ఉంటుంది? దీని నుంచి ఎవరు బయటపడ్డారు?

మనం రోజువారీ జీవితంలో ఎవరో చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో చిక్కుకుపోతే ‘పద్మవ్యూహంలో ఇరుక్కుపోయాడు’ అని అంటుంటాం. ఈ పదానికి మూలం మహాభారతం లో ఉంది. యుద్ధరంగంలో శత్రువును గందరగోళానికి గురిచేసి, బయటపడనీయకుండా చేసేందుకు రూపొందించిన అత్యంత కఠినమైన వ్యూహరచనకే పద్మవ్యూహం లేదా చక్రవ్యుహం అని పేరు. ఇది తామరపువ్వు ఆకారంలో ఏర్పడే యుద్ధ నిర్మాణం కావడం వల్ల పద్మవ్యూహం అని పిలిచారు.

ఎలా ఉండేది పద్మవ్యూహం?
పద్మవ్యూహం మొత్తం ఏడు వలయాలుగా ఉండేది. ప్రతి వలయంలో రథాలు, గజసేన, అశ్వసేన, పదాతి దళాలు ప్రత్యేక క్రమంలో అమర్చబడేవి. బయట నుంచి చూస్తే అది తిరుగుతున్న చక్రంలా కనిపించేది. ఒక వలయం దాటితే వెంటనే మరొకటి మూసుకుపోయేది. అందుకే అందులోకి ప్రవేశించడం కష్టమైతే, బయటకు రావడం ఇంకా కష్టంగా మారేది. శత్రువు లోపలికి వచ్చిన వెంటనే అన్ని వైపుల నుంచి దాడి జరిగేలా ఇది రూపొందించబడేది.

ద్రోణాచార్యుడి వ్యూహం
ద్రోణాచార్య కౌరవ సేనాధిపతిగా ఉన్న సమయంలో ఈ పద్మవ్యూహాన్ని ప్రయోగించారు. లక్ష్యం ఏమిటంటే పాండవ సేనను విడదీసి, ముఖ్య యోధులను ఒంటరిగా చిక్కించుకోవడం. ముఖ్యంగా అర్జునుడిని యుద్ధభూమి నుంచి దూరం చేసి, మిగతా పాండవులను బలహీనపరచడమే ఆ వ్యూహం వెనుక ఉద్దేశం.

అభిమన్యుడి ప్రవేశం.. కానీ బయటకు రావలేకపోవడం
అభిమన్యుడు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే పద్మవ్యూహంలోకి ఎలా ప్రవేశించాలో తెలుసుకున్నాడని కథనం చెబుతుంది. అయితే బయటకు వచ్చే విధానం పూర్తిగా వినలేకపోయాడు. యుద్ధ సమయంలో పాండవులలో మరెవ్వరూ ఆ వ్యూహాన్ని ఛేదించలేని పరిస్థితి రావడంతో అభిమన్యుడు ముందుకు వచ్చాడు. అతడు తొలి వలయాలను ఛేదిస్తూ లోపలికి వెళ్లాడు. కానీ వెంట వచ్చిన పాండవులు అడ్డుకుపోవడంతో అతడు ఒంటరిగా లోపల చిక్కుకున్నాడు. అక్కడ కౌరవ మహారథులు కలిసి అతనిపై దాడి చేసి వీరమరణం పొందేలా చేశారు.

పద్మవ్యూహాన్ని ఛేదించగలిగిన మహాయోధులు
పురాణ కథనాల ప్రకారం.. ఈ వ్యూహాన్ని పూర్తిగా ఛేదించి బయటకు రావడం చాలా కొద్ది మందికే సాధ్యమైంది. వారిలో కృష్ణుడు, పద్యుమ్న, భీష్మ, ద్రోణాచార్య,కృపాచార్య, కర్ణ, అశ్వత్థామ, అర్జునుడు పేర్లు ప్రధానంగా చెప్పబడతాయి.

ఇప్పటికీ ఎందుకు పద్మవ్యూహం ఉదాహరణగా వాడతారు?
ఇప్పటి భాషలో పద్మవ్యూహం అంటే బయటపడటానికి మార్గం కనిపించని క్లిష్ట పరిస్థితి అని అర్థం. రాజకీయాల్లో, వ్యాపారాల్లో, వ్యక్తిగత జీవితంలో సమస్యలు వరుసగా చుట్టుముట్టినప్పుడు ఈ పదాన్ని రూపకంగా ఉపయోగిస్తారు. అంటే సమస్యలోకి వెళ్లడం సులభం అయినా, బయటపడటం కష్టం అనే భావనకు పద్మవ్యూహం సరైన ఉదాహరణగా నిలిచింది

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News