ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళం జరుగుతోంది. దేశ, విదేశాల నుంచి కోట్లాది మంది ఇక్కడికి వస్తున్నారు. అయితే వీరిలో నాగసాధువుల పాత్ర కీలకంగా ఉంటుంది. హిమాలయాల్లో.. రహస్య ప్రాంతాల్లో ఉన్న సాధువులు ఇక్కడికి వచ్చి అఖాఢా శిబిరాలను ఏర్పాటు చేస్తారు. కొత్తగా సన్యాసం పుచ్చుకోవాలని అనుకునేవారు.. ఈ అఖాడా శిబిరానికి వస్తారు. ఇప్పటి వరకు ఉన్న సాధవులంతా శిబిరాలు ఏర్పాటు చేసుకొని సమావేశం అవుతారు. ప్రస్తుతం 13 ఉన్నాయి. వీటిలో 7 శైవులవి, 3 వైష్ణవులవి, 3 సిక్కులవి. అఖాడాలను అఖారాలు అని కూడా పిలుస్తారు. అయితే ఈ అఖాడాలు ఎందుకు ఏర్పడ్డాయి? వీటి నిర్వహణ ఎలా ఉంటుంది?
పూర్వ కాలంలో బౌద్ధమతం వ్యాప్తి చెందకుండా ఆది శంకరాచార్యులు అఖాడాలను ఏర్పాటు చేశారని చెబుతూ ఉంటారు. ‘అఖారా’ అనే పదం మల్ల యుద్ధం చేసే ప్రదేశానికి పెడుతారు. కుంభమేళాలో కూడా సాధువులు ఏర్పాటు చేసుకునే శిబిరాలకు తమ గురువుల పేరుతో అఖారా బృందాలు ఏర్పడుతాయి. మొఘలుల దండయాత్ర కాలంలో హిందూ సంస్కృతిని కాపాడడానికి వీటిని ఏర్పాటు చేసినట్లు చెబుతుంటారు. ప్రస్తుతం 13 వరకు అఖాడాలు ఉన్నట్లు సమాచారం. వీటిలో జునా అఖారా, పంచాగ్ని అఖారా, ఆనంద్ అఖారా, అటల్ అఖారా, నిర్మల్ పంచాయతీ అఖారా, నింజని అఖారా, జునా అఖారా, మహానిర్వాన్ అఖారా, ఆహ్వాన్ అఖారా, ఉదాసిన్ న్యూ అఖారా, ఉదాసిన్ పంచాయతీ బిగ్ అఖారా, నిర్మోహి అఖారా ఉన్నాయి. ప్రతీ మహాకుంభమేళాలో అఖాడాలన్నీ సమావేశం అవుతాయి. వీరు హిందు మతంపై, గ్రంథాలపై ప్రత్యేకంగా అధ్యయనం చేస్తారు. అఖాడాలు ఎన్ని రకాలు ఉన్నాయో.. వేటికి అవే ప్రత్యేక సంప్రదాయాలు కలిగి ఉంటాయి. వీరిలో శైవం, వైష్ణం మతానికి చెందిన వారు ఉంటారు. ఈ అఖాడాలో ఉన్న వారు పోరాటాలు చేయడానికి కూడా సంసిద్ధులవుతారు. వీరు మతాన్ని రక్షించడం కోసం ఎంతటి పోరాటానికైనా ముందుకు వెళ్తారు.

నాగసాధువులుగా మారిన వారు ఏదో ఒక అఖాడాలో ఉంటారు. తమ గురువు పేరుతో నిర్వహించే అఖాడాల్లో వీరు సభ్యులుగా మారుతారు. అయితే అఖాడాల్లో చాలా పద్ధతిగా ఉండాలి. గురువును కాదని ఎలాంటి పనులు చేయరాదు. చిన్న పొరపాటుకే గంగలో 108 సార్లు మునగాలని చెబుతారు. ఆ తరువాత క్షమాపణలు కోరి పూజ చేసిన ప్రసాదం ఇవ్వడం ద్వారా అతని పాపాలను క్షమించినట్లు అవుతుంది. ఒకవేళ వివాహం లేదా తీవ్ర నేరానికి పాల్పడితే అఖాడా నుంచి బహిష్కరిస్తారు. కుంభమేళాలో ఏర్పాటు చేసుకున్న ప్రతీ అఖాడాకు సమీపంలో ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. అఖాడాల సభ్యుల మధ్య ఎలాంటి అవాంచనీయ సంఘటనలు కలగకుండా వీరు భద్రత ఇస్తారు.
