Thursday, March 19, 2026

హైదరాబాద్ నుంచి పిల్లలతో కలిసి ఒక్కరోజులో వెళ్లివచ్చే పర్యాటక ప్రదేశాలు ఇవే..

వేసవికాలం అనగానే ఎండ బాధ భరించడం ఎలా? అని కొందరు బాధపడతారు. కానీ విద్యార్థులు మాత్రం సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఈ కాలంలో సెలవులు వస్తుంటాయి. అయితే సెలవులను వృథా చేయకుండా వివిధ పర్యాటక ప్రదేశాలను సందర్శించడం వల్ల వారిలో జ్ఞానాన్ని పెంపొందించినట్లు అవుతుంది. తల్లిదండ్రులకు పిల్లలతో కలిసి విహార యాత్రలకు వెళ్లాలని ఉంటుంది. కానీ సమయం ఉండదు. అయితే వీకెండ్ లో ఒకసారి అయినా వెళ్లాలని అనుకుంటారు. ఇలా ఒక్కరోజులో విహారయాత్ర చేసే పర్యాటక ప్రదేశాలు తెలంగాణలో చాలా వరకు ఉన్నాయి. వీటిని ప్రతి వారం ఒకటి ప్లాన్ చేసుకున్న అనేక రకాల ప్రదేశాలను చూసుకోవచ్చు. వీటిలో ముఖ్యమైన ప్రదేశాలు ఏవో చూద్దాం..

కండ్లకోయ ఆక్సిజన్ పార్కు:

హైదరాబాద్ లో ఉండే వారికి చుట్టుపక్కల సందర్శించడానికి ఎన్నో రకాల పార్కులు ఉన్నాయి. వీటిలో కండ్లకోయ ఆక్సిజన్ పార్కు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పార్కులో యోగా హాల్, వాక్ వే ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి స్థలాలు ఉన్నాయి. ఇందులో పక్షులతోపాటు ట్రీ హౌస్ కూడా ఉంటుంది. కుటుంబంతో కలిసి ఇక్కడ ఒక రోజంతా గడిపితే ఎంతో ఉల్లాసంగా ఉంటుంది.

లక్నవరం సరస్సు:

వరంగల్ జిల్లాలోని లక్నవరం సరస్సు ఆహ్లాదంగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి 220 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ సరస్సు తోపాటు ఏటూరు నాగారం అభయారణ్యం సందర్శకులను ఆకట్టుకుంటుంది. అలాగే ఇక్కడ లేక్ క్రాసింగ్, రూప్ వే, కయాకింగ్ వంటివి ఉన్నాయి. దీనిని ఒక్కరోజు కూడా సందర్శించి వెళ్లొచ్చు.

శామీర్ పేట లోని సరస్సు:

హైదరాబాద్ కు సమీపంలో ఉన్న శామీర్ పేట లోని సరస్సు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది. ఇక్కడ ఉన్న జింకల పార్కుతో పిల్లలు సంతోషంగా గడుపుతారు. అలాగే ఇక్కడ విలాసవంతమైన రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులు ఎవరైనా ప్రత్యేక రోజులో ఇక్కడికి వెళ్లి సంతోషంగా గడపొచ్చు.

అనంతగిరి కొండలు..

ట్రెక్కింగ్ అంటే కొందరికి మహా ఇష్టం. అది కోరుకునే వారికి అనంతగిరి కొండలు చాలా అద్భుతంగా ఉంటాయి. వికారాబాద్ కు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడ పద్మనాభ స్వామి ఆలయం కూడా ఉంటుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News