తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సమరం ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. అయితే అంతకుముందే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉంది. అధికారులు ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ ఎన్నికలు జరిగితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ ప్రాంతాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొదటి విడతలో మొత్తం 30 జెడ్పీటీసీ స్థానాలు, 311 స్థానాలకు జరుగనున్న పరిషత్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల కోసం అక్టోబర్ 9 నుంచే నామినేషన్ ప్రక్రియ మొదలు కానుంది. ప్రతిరోజు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. అలా అక్టోబర్ 11 వరకు నామినేషన్ల పర్వం కొనసాగనుంది. అక్టోబర్ 12వ తేదీన నామినేషన్లు పరిశీలన చేసి, 15న ఉపసంహరణ కోసం అవకాశం ఇస్తారు. ఆ తరువాత అక్టోబర్ 23న జరుగనున్న మొదటి విడత ఎన్నికలు నిర్వహించి.. నవంబర్ 11న ఫలితాల వెల్లడించనున్నారు.
కరీంనగర్ జిల్లాలో.. మొత్తం 15 జెడ్పీటీసీలు, 170 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనన్నాయి. మొదటి విడతలో జిల్లాలోని హుజూరాబాద్ డివిజన్ పరిధిలోని ఆరు మండలాల్లో 6 జెడ్పీటీసీ స్థానాలు, 70 ఎంపీటీసీ స్థానాలకు జరుగనున్న ఎన్నికలు నిర్వహిస్తారు. శంకరపట్నం, వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, హుజూరాబాద్, సైదాపూర్ మండలాల్లో తొలివిడతలో జరుగనున్న పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి.
జగిత్యాల జిల్లాలో.. మొదటి విడతలో 10 జెడ్పీటీసీ స్థానాలతో పాటు, 108 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తొలివిడతలో బీర్పూర్, రాయికల్, సారంగాపూర్, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్ పెల్లి, భీమారం, కథలాపూర్, కోరుట్ల, మేడిపల్లి మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటి విడతలో 7 జెడ్పీటీసీ, 65 ఎంపీటీసీ స్థానాలకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. బోయినపల్లి, చందుర్తి, రుద్రంగి, వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, కోనరావుపేట, ఇల్లంతకుంట మండలాల్లో మొదటి విడతలో ఎన్నికలు నిర్వహిస్తారు. ..
పెద్దపెల్లి జిల్లాలోమొదటి విడతలో 7 జెడ్పీటీసీ, 68 ఎంపీటీసీ స్థానాలకు జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. అంతర్గాం, ధర్మారం, పాలకుర్తి, కమాన్ పూర్, మంథని, ముత్తారం, రామగిరి మండలాల్లో జరుగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారు.
నామినేషన్ల స్వీకరణ కోసం రిటర్నింగ్ అధికారుల వద్ద కావల్సిన ఏర్పాట్లు పూర్తి చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్స్ స్వీకరణ, పరిశీలన, అప్పీళ్ల పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.





