ఆయిల్ ఫామ్ సాగు విస్తరణలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన పురోగతిని సాధిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తున్న ‘జాతీయ ఆహార నూనెల మిషన్ – ఆయిల్ ఫామ్ (National Mission on Edible Oils – Oil Palm – NMEO-OP)’ లక్ష్యాలను చేరుకోవడంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉంది. కేంద్ర ప్రభుత్వం 2021 నుంచి మొదలైన ఐదేళ్ల కాలానికి దేశంలోని 9 రాష్ట్రాలకు మొత్తం 3.22 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాలకనుగుణంగా, తెలంగాణ రాష్ట్రం ఇప్పటివరకు 78,869 హెక్టార్ల విస్తీర్ణంలో ఆయిల్ ఫామ్ సాగును చేసి, నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో ఇతర రాష్ట్రాల కంటే చాలా ముందంజలో నిలిచింది.కేంద్రం నిర్దేశించిన 9 రాష్ట్రాల లక్ష్యంలో తెలంగాణ అత్యధిక విస్తీర్ణం సాధించడం విశేషం. తెలంగాణ తర్వాత ఆయిల్ ఫామ్ సాగు విస్తరణలో ఇతర రాష్ట్రాల పనితీరు ఈ విధంగా ఉంది:
తెలంగాణ 78,869 హెక్టార్లు
ఆంధ్రప్రదేశ్ (ఏపీ): 67,727 హెక్టార్లు
ఒడిశా: 4,946 హెక్టార్లు
దేశంలో వంట నూనెల దిగుమతి భారాన్ని తగ్గించాలనే లక్ష్యంతో కేంద్రం NMEO-OP పథకాన్ని అమలు చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 2.72 లక్షల ఎకరాల్లో 73,696 మంది రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు. రాబోయే మూడేళ్లలో 10 లక్షల ఎకరాలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయిల్ ఫాం సాగు వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం విస్తృతమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మొక్కల కొనుగోలు, డ్రిప్ పరికరాల ఏర్పాటుపై భారీ సబ్సిడీలు అందిస్తోంది. ఎస్సీ/ఎస్టీ రైతులకు 100% సబ్సిడీతో పాటు, ఇతర రైతులకు కూడా అధిక రాయితీలు కల్పిస్తోంది. అలాగే రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం ఆయిల్ ఫాం గెలల టన్నుకు రూ.21,000లకు పెంచింది. ఆయిల్ ఫామ్ మొక్కలు ఫలసాయానికి వచ్చే మొదటి 3-4 సంవత్సరాలలో రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు, మొక్కల మధ్య ఖాళీ స్థలంలో కూరగాయలు, పూల మొక్కలు, పశుగ్రాసాలు వంటి అంతర పంటలను పండించుకునేందుకు కూడా ప్రోత్సాహం అందిస్తోంది.
తెలంగాణలో అత్యధికంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇక్కడ 50,000 ఎకరాల్లో ఆయిల్ ఫాం సాగు జరుగుతున్నట్లు సమాచారం. అలాగే ఇక్కడే ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు కూడా ఇక్కడే మొదట స్థాపించబడ్డాయి. అయితే ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా ఆయిల్ ఫామ్ సాగు విస్తరిస్తున్నట్లు అధికారిక నివేదికలు సూచిస్తున్నాయి.రైతులను ప్రోత్సహించడంలో, లక్ష్యాలను చేరుకోవడంలో ఈ జిల్లా చురుకుగా ఉంది.ఈ జిల్లాలోని నర్మెట్ట వద్ద రూ. 300 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక పామాయిల్ ప్రాసెసింగ్ కర్మాగారం (ఫ్యాక్టరీ) ఈ సాగుకు మరింత ఊతమిస్తోంది. అలాగే, ఉమ్మడి నల్గొండ , వరంగల్, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాలలో కూడా ఆయిల్ ఫామ్ సాగుకు రైతులు భారీగా ఆసక్తి చూపిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ (పామాయిల్) సాగు పరిస్థితి చాలా చురుకుగా, ప్రోత్సాహకరంగా ఉంది. ఈ సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతా రంగంగా గుర్తించి, భారీగా ప్రోత్సహిస్తోంది. వరి సాగుకు ప్రత్యామ్నాయంగా, రైతులకు స్థిరమైన, దీర్ఘకాలిక ఆదాయాన్ని అందించే పంటగా ఆ
ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం భారీగా ఆర్థిక సహాయం అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు: మొక్కలు, డ్రిప్ పరికరాల ఏర్పాటుకు 100% సబ్సిడీ, బీసీ రైతులకు 90% సబ్సిడీ అందిస్తోంది. సాగును ప్రోత్సహించేందుకు, రైతులు ఆయిల్ ఫామ్‌లో పెట్టుబడి పెట్టినందుకు నాలుగేళ్ల వరకు ఎకరాకు సుమారు ₹50,000 వరకు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నారు. పూర్తి వివరాలకు సమీప వ్యవసాయ కేంద్రాల్లో సంప్రదించాలి.





