ఒక సినిమా హీరో తన స్టెంట్స్, యాక్షన్ సినిమా వరకే ఉంటుంది. రియల్ లైఫ్ వచ్చేసరికి భిన్నంగా ఉంటుంది. అయితే కొందరు హీరోలు రియల్ లైఫ్ లోను సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎంత సేవ చేసినా వారికి వచ్చే ఆదాయంలో కొంత భాగం మాత్రమే అని అనుకోవచ్చు. అయితే ఈ సేవ ఆర్థికంగానూ.. లేదా పేదలను ఆదుకోవడం వంటివి ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఇండస్ట్రీకి చెందిన కొందరికి చేదోడు వాదోడుగా ఉండేవారు ఉన్నారు. కానీ ఒక సినిమా హీరో ఏకంగా 8000 మందికి విద్యాదానం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇటీవల వీరంతా డిగ్రీ పట్టాలు తీసుకొని వారు చెప్పే ఒక్కో గాథను వింటే.. ఆ హీరోకు మాత్రమే కాదు చూసేవారందరికీ కన్నీళ్లు వచ్చాయి. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో విద్యా దానం చేసే గొప్ప వ్యక్తి ఉండడం తాము చేసుకున్న ఎంతో అదృష్టమని ఆ విద్యార్థులు చెప్పడం పై వీక్షకులు భావోద్వేగానికి గురవుతున్నారు. అసలు వీరికి విద్యా దానం చేసిన హీరో ఎవరు? ఎలా చేశారు?

సౌత్ సినీ ఇండస్ట్రీ తో పాటు బాలీవుడ్ లోనూ కొన్ని సినిమాల్లో కనిపించిన నటుడు సూర్య గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. సింగం (తెలుగులో యముడు) సీక్వెల్ సినిమాలతో తెలుగు ఫ్యాన్స్ కు దగ్గర అయిన ఈ హీరో సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయి. అలాగే అతని పర్సనల్ లైఫ్ కూడా మిగతావారు ఊహించిన విధంగా కాకుండా గొప్పగా ఉందని కొందరు ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే సూర్య స్థాపించిన అగరం ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది విద్యార్థులు ఈరోజు ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారు. 2025 ఆగస్టు 3 వరకు ఈ ఫౌండేషన్ స్థాపించి 15 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నిర్వహించిన స్నాతకోత్సవంలో మొత్తం 8 వేల మంది చదువు అగరం ఫౌండేషన్ ద్వారా పూర్తి చేసుకున్నారు. వీరిలో 1800 మంది ఇంజనీర్లు ఉండగా.. 51 మంది డాక్టర్లు ఉన్నారు. వీళ్లంతా ఈ కార్యక్రమంలో స్టేజీపైకి వచ్చి సూర్యను అభినందించారు. వీరిలో ఒకరు తాను తయారు చేసిన బ్యాటరీ స్కూటర్ ను చూసి సూర్య భావోద్వేగానికి గురయ్యారు.

అన్ని దానాల్లో కల్లా విద్యాదానం కూడా గొప్పదే.. అన్న విషయం తెలిసిన సినీ నటుడు సూర్య.. గ్రామీణ పేదకుటుంబాలకు చెందిన విద్యార్థులకు విద్య సహాయం చేయాలని సంకల్పించారు. దీంతో కుటుంబ సభ్యుల సహకారంతో 2006 సెప్టెంబర్ 25 న సూర్య ‘అగరం’ ఫౌండేషన్ స్థాపించారు. అంతకుముందే సూర్య తండ్రి శివకుమార్.. తన కుమారులు సూర్య, కార్తీక్ ల సహాయంతో 1979 నుంచి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేవారు.

అయితే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వెనుకబడిన, ప్రతిభావంతులైన విద్యార్థులను మరింత ప్రోత్సహించేందుకు చెన్నై లోని టీ నగర్ లో అగరం ఫౌండేషన్ స్థాపించాల్సి వచ్చింది. 2018లో అగరం ఫౌండేషన్ ‘అరం సెయ్యవింబువోమ్’ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఆ తరువాత 2020 మరో రెండు పుస్తకాలను విడుదల చేశారు. తమిళనాడులోని మారుమూల ప్రాంతాల్లో నివసించే పిల్లల కోం ‘వాళికటిగల్’ అనే మెంటర్ షిప్ ను కూడా ప్రారంభించారు. కేవలం విద్యార్థులకు మాత్రమే కాకుండా అగరం ఫౌండేషన్ 2017లో పేద కుటుంబానికి ఇల్లు నిర్మించడం, 2020లో కోవిడ్ సమయంలో తంజావూర్ ప్రభుత్వ ఆసుపత్రికి ₹25 లక్షల విరాళం, 2018లో 400 ప్రభుత్వ పాఠశాలలు రీనోవేట్ చేసింది.






