ఆషాఢం మాసం పూర్తి కాగానే పండుల సీజన్ మొదలవుతుంది. శ్రావణమాసంలో మొదటగా వచ్చే పండుగ నాగుల పంచమి. నాగుల పంచమి రోజున మహిళలు పుట్టలో పాలు పోస్తారు. ఆ తరువాత నాగేంద్రస్వామిని తమ కోరికలు తీర్చాలని వేడుకుంటారు.2024 ఏడాదిలో ఆగస్టు 9న నాగుల పంచమి రాబోతుంది. ఈ సందర్భంగా నాగుల పంచమి వేడుకలు నిర్వహించుకునేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు. అయితే నాగుల పంచమి రోజున ఎలాంటి పూజలు చేయాలి? ఏ నియమాలు పాటించాలి?
బ్రహ్మపురాణం ప్రకారం ప్రతీ నాగుల పంచమి రోజున నాగు పాములు విశేష పూజలు అందుకుంటాయి. నాగుల పంచమి రోజున తక్షక, కర్కోటక, పింగలి, అనంత, వాసుకీ అనే పాములు పూజలు అందుకుంటాయి. జాతకంలో ఎవరికైన నాగదోషం, కాల సర్పదోషం, రాహు, కేతు దోషాలు ఉన్న వారు నాగుల పంచమి రోజు పూజలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నాగుల పంచమి రోజున వీలు కాకపోతే పూజలు చేయకపోయినా పర్వలేదు. కానీ పాములకు మాత్రం ఎలాంటి హానీ కలిగించకూడదు.
నాగుల పంచమి రోజు ఎక్కడా నేలను తవ్వకుండా ఉండడమే మంచింది. ముఖ్యంగా పుట్ట ఉన్న ప్రాంతంలో తవ్వడం వల్ల పాములకు హాని కలుగుతాయి. అయితే పుట్ట ప్రాంతంలో కాకుండా ఎక్కడ తవ్వినా ఏదో రకమైన పాము ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఈరోజు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండడమే మంచిదని అంటారు. అలాగే ఈరోజు చెట్లు కూడా నరకొద్దని అంటారు.
నాగుల పంచమి రోజున పుట్టలో పాలు పోస్తుంటారు. కానీ పుట్టలో పోసే బదులు నాగ విగ్రహాలపై అభిషేకం చేయడం మంచిదని కొందరి అభిప్రాయం. ఎందుకంటే ఏధైనా పుట్టలో పాము ఉంటే ఎక్కువగా పాలు పోయడం వల్ల అవి ఇబ్బందిగా ఉంటాయి. లేదా పుట్ట వద్ద ఏదైనా పాత్ర ఉంటే అందులో పోయడం మంచింది. లేకపోతే పుట్టలో పాలు పోసినా అది ఫలితాన్ని ఇవ్వదు.
అలాగే ఈరోజు సూది, దారం ఉపయోగించవద్దని అంటారు. అలాగే ఇనుప పాత్రలో భోజనం చేయవద్దని అంటారు. ఇలా చేయడం వల్ల అరిష్టం అని చెబుతూ ఉంటారు. ఇక నాగ పంచమి రోజున ఎక్కడ పాము కనిపించినా దానిని వదిలేయాలని, చంపకూడదని, నాగ పంచమి రోజు పామును చంపితే ఏడు జన్మల పాటు కుటుంబానికి దోషం ఉంటుందని ఆధ్యాత్మిక వాదులు చెబుతున్నారు.





