పెట్రోల్ ధర చెబితే వాహనదారుల గుండెలు గుభేళ్లుమంటాయి. ఎందుకంటే రూ.100 పెడితే గానీ బయటకు వెళ్లే పరిస్థితి లేదు. పెట్రోల్ ధరలు రోజురోజుకు పెరగడమే గానీ.. తగ్గడం లేదు. ఇటీవల ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పెట్రోల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అయితే మిగతా రాష్ట్రాలతో పోలిస్టే తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు ఎక్కువగానే ఉంటాయి. జూన్ 14 2025 ప్రకారం.. పెట్రోల్ ధరలు హైదరాబాద్ లో రూ.107.46 ఉండగా.. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.68 గా ఉంది. అయితే ఏపీలోని ఈ ప్రదేశంలో పెట్రోల్ ధరలు తక్కువగా ఉంటాయి. అదెక్కడంటే?
మన దేశంలో 29 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్న విషయం తెలిసిందే. ఇందులో ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడను ఆనుకొని పుదుచ్చేరిలోని యానాం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది అందమైన ప్రదేశం కావడంతో చాలా మంది ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. అంతేకాకుండా విభిన్న రకాల సీ ఫుడ్ కూడా లభిస్తూ ఉంటుంది. యానాంలో తెలుగువారితో పాటు ఫ్రెంచ్ కు చెందిన వారు ఉంటారు. తూర్పుగోదావరి జిల్లా సరిహద్దుగా ఉన్న 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో యానాం ఉంటుంది.
అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోని ప్రాంతాలతో పోలిస్తే పెట్రోల్ రేటు చాలా తక్కువ. 2025 జూలై 14 లీటర్ పెట్రోల్ కు రూ.96.92గా ఉంది. ఇక్కడ పెట్రోల్ ధరలు తక్కువగా ఉండడానికి ట్యాక్స్ తక్కువగా వేయడమే కారణం. సాధారణంగా ఒక రాష్ట్రంలో అసలు పెట్రోల్ ధర రూ.55.66 ఉంటే.. దీనికి 55 శాతం పన్ను విధిస్తారని క్లియర్ టాక్స్ నివేదిక ప్రకారం తెలుస్తోంది. (ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్ లు ఆయా రాష్ట్రాలను బట్టి ఉంటాయి) అలాగే డీజిల్ పై 50 శాతం విధిస్తారని పేర్కొంది. అంటే అసలు పెట్రోల్ ధర రూ.55.66 అంటే అన్నీ పన్నులు కలిపి రూ.107కి విక్రయిస్తున్నారు.
యానాంలో మాత్రం పెట్రోల్ పై కేంద్ర ప్రభుత్వం రూ.19.90, పుదుచ్చేరి వ్యాట్ రూ.17.69 విధిస్తుంది. అంటే దాదాపు రూ.37.59 వరకు ట్యాక్స్ విధిస్తున్నారు. సాధారణ పెట్రోల్ రూ.59.4 అనుకుంటే ట్యాక్స్ తో కలిపి మొత్తం రూ.96.92గా ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ లోని పెట్రోల్ తో పోలిస్తే.. రూ.12.76 తక్కువగా లభ్యం అవుతుంది. ఇక్కడ పెట్రోల్ ధర తక్కువగా ఉండడంతో వాహనాల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ఇక్కడ 18 వేల వెహికల్స్ ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇటీవల పెట్రోల్ బంకులను పెంచేందుకు చర్యలు తీసుకోనున్నారు.