తెలంగాణలో రాజ్యసభ స్థానంపై ఇప్పుడు ఆసక్తిగా చర్చ సాగుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన కే కేశవరావు తన పదవి కాలం ఉన్నా పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఈసారి ఎన్నికైన వారు 2026 ఏప్రిల్ 9వ వరకు కొనసాగుతారు. రాజ్యసభకు పోటీ చేసేవారి జాబితాను పంపాలని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ లో పేర్కొన్నారు. ఎన్నిక అవసరం అయితే ఆగస్టు 27న నిర్వహిస్తారు. ఈ మేరకు ఆగస్టు 14 (బుధవారం) నోటిఫికేషన్ జారీ కానుంది. ఏఐసీసీ కోటాలో ఈ పదవి ఉండడంతో ఈ పదవి కాంగ్రెస్ దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి ఆశావహులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. కాంగ్రెస్ లో సీనియర్ల ఇప్పటికే కొన్ని పదవులను ఆశిస్తున్నారు. ఈ తరుణంలో రాజ్యసభ సీటు వీరికి అందివచ్చిన అవకాశంలా మారింది. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం వేరే లెవల్లో ఆలోచిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చాక కొందరు సీనియర్ల నామినేటెడ్, ఇతర పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో ముఖ్యంగా సీనియర్ లీడర్ జి. హనుమంతరావు ఉన్నారు. ఎప్పటి నుంచో కాంగ్రెస్ లో కొనసాగుతున్న హనుమంతరావు గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అయితే తనకు ఈ అవకాశం ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం. మరోవైపు పార్టీ సీనియర్ లీడర్ అద్దంకి దయాకర్ సైతం ఈ పదవి కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ తరువాత ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చినట్లే ఇచ్చి.. చివరి నిమిషంలో తన పేరును తీసేశారు. ఆయన అసంతృప్తి చెందినా పార్టీలో కొనసాగుతున్నారు. దీంతో తనకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ సైతం రాజ్యసభ స్థానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక కొందరు సీనియర్ నేతలు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కను కలిసి విన్నవించుకుంటున్నారు. అయితే అధిష్టానం మదిలో వేరే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ స్థానం కోసం పోటీ ఎక్కువగా ఉండడంతో ఈ స్థానాన్ని వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా అభిషేక్ సింఘ్వీ పేరును ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తుంది. హైకమాండ్ కనుగ అదే నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ నేతల్లో మరోసారి నిరాశ ఎదురవుతుంది.