Sunday, March 22, 2026

తెలంగాణలో కొత్త ట్రాఫిక్ రూల్స్.. అలా చేస్తే ఇక వాహనం సీజ్..

తెలంగాణ రవాణ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ అమలు వ్యవస్థను మరింత కఠినతరం చేసే దిశగా కొత్త నిబంధనల అమలుకు సన్నాహాలు పూర్తి అయ్యాయి. కేంద్ర మోటార్ వెహికల్ నిబంధనల మార్పులకు అనుగుణంగా, పెండింగ్ చలాన్లు, పునరావృత ట్రాఫిక్ ఉల్లంఘనలు, డిజిటల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా చలాన్లు చెల్లించకుండా వాయిదా వేస్తున్న వాహనదారులపై ఈసారి నేరుగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ సేవలపైనే ప్రభావం పడేలా చర్యలు ఉండనున్నాయి.

కీలక మార్పులు
5 చలాన్ల లిమిట్: ఏడాదికి 5 కంటే ఎక్కువ పెండింగ్ చలాన్లు ఉంటే DL, RC ఫ్రీజ్ అవుతాయి. వాహనం చట్టపరంగా అర్హత కోల్పోతుంది.

45 రోజుల గడువు: చలాన్ పడిన 45 రోజుల్లో చెల్లించాలి. ఆ తర్వాత బ్లాక్‌లిస్ట్‌లో చేరి, ఇన్సూరెన్స్ రెన్యూవల్, వాహన విక్రయం కష్టం.

సీజ్ చర్యలు: ఫ్రీజ్ తర్వాత రోడ్డుపై కనిపిస్తే పోలీసులు వెంటనే సీజ్ చేస్తారు .. ఇంట్లో ఉంచినా డేటాబేస్‌లో ట్రాక్ అవుతుంది.

కొత్త విధానం ఏప్రిల్ 1 నుంచి అమలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నిబంధనల ప్రకారం ఒకే వాహనంపై ఏడాదిలో ఐదు కంటే ఎక్కువ ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదై, వాటికి సంబంధించిన చలాన్లు నిర్ణీత గడువులో చెల్లించకపోతే ఆ వాహన యజమాని డ్రైవింగ్ లైసెన్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉంది. అదే సమయంలో వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా “నాట్ టు బీ ట్రాన్సాక్టెడ్” కేటగిరీలోకి వెళ్తుంది. అంటే ఆ వాహనానికి సంబంధించి పేరు మార్పు, అడ్రెస్ మార్పు, ఫిట్‌నెస్, హైపోథెకేషన్ తొలగింపు వంటి సేవలు నిలిచిపోతాయి.

ఇకపై చలాన్ పడిన తర్వాత గరిష్టంగా 45 రోజులలోపు ఫైన్ చెల్లించాలి. ఈ గడువు దాటినా చెల్లించకపోతే వాహనం డేటాబేస్‌లో బ్లాక్‌లిస్ట్ అవుతుంది. వాహనాన్ని రోడ్డు మీద నడపకపోయినా, ఇంట్లో నిలిపి ఉంచినా, రికార్డుల్లో అది డిఫాల్టర్‌గా కొనసాగుతుంది. భవిష్యత్తులో ఇన్సూరెన్స్ రీన్యువల్, వాహనం అమ్మకం, ఆన్‌లైన్ సేవలు అన్నీ ఇబ్బందికరమవుతాయి.

సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చలాన్లపై ఇకపై భారీ డిస్కౌంట్లు ఉండవని స్పష్టం చేశారు. గతంలో ఇచ్చినట్లుగా పెండింగ్ చలాన్లపై సడలింపులు ఇవ్వకుండా, నేరుగా చెల్లింపు క్రమశిక్షణ తీసుకురావాలని అధికారులకు సూచించారు. అవసరమైతే భవిష్యత్తులో వాహన యజమాని బ్యాంక్ ఖాతాలకు చలాన్ వ్యవస్థను అనుసంధానం చేయాలని కూడా సూచించినట్లు సమాచారం.

తప్పుడు చలాన్లు పడిన సందర్భాల్లో వాహనదారులకు ఉపశమనం కల్పించేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ రెడ్రెసల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. సీసీ కెమెరా తప్పుగా నంబర్ రీడ్ చేసినా, వేరే వాహనానికి సంబంధించిన చలాన్ మీ పేరుమీద నమోదైనా, దానికి సంబంధించి ఆన్లైన్‌లో అభ్యంతరం తెలపగల అవకాశాన్ని ఇవ్వనున్నారు. సరైన ఆధారాలు సమర్పిస్తే సంబంధిత చలాన్‌ను రద్దు చేసే విధానం ఉండనుంది.

Parivahan లేదా రాష్ట్ర ఈ-చలాన్ పోర్టల్ ద్వారా నెలకు కనీసం ఒక్కసారైనా మీ వాహనంపై పెండింగ్ చలాన్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం ఇప్పుడు అత్యంత అవసరం. ఎందుకంటే చాలాసార్లు ట్రాఫిక్ పోలీసులు ఆపకుండానే కెమెరాల ద్వారా ఆటోమేటిక్‌గా చలాన్లు జనరేట్ అవుతున్నాయి. మెసేజ్ రాకపోయినా రికార్డులో పెండింగ్‌గా ఉండే అవకాశం ఉంది.

హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవడం, సిగ్నల్ జంప్ చేయకపోవడం, మొబైల్ ఫోన్ ఉపయోగించకపోవడం వంటి సాధారణ నియమాలు పాటిస్తే ఈ కఠిన చర్యల నుంచి తప్పించుకోవచ్చు. లేదంటే చిన్న నిర్లక్ష్యం కూడా భవిష్యత్తులో లైసెన్స్, ఆర్‌సీ సేవలపైనే ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడుతుంది

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News