అమ్మాయిల రక్షణకు ఓ వైపు ప్రభుత్వంతో పాటు పోలీసులు అనేక రక్షణ చర్యలు ఏర్పాటు చేస్తున్నారు. అయినా ఇంటి నుంచి బయటకు వెళ్లిన తమ పాప తిరిగి వచ్చేవరకు భయపడుతూనే ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కంటిరెప్పలా కూతురును కాపాడాల్సిన ఓ తల్లి కర్కశత్వానికి పాల్పడడానికి ప్రయత్నించింది. అయితే బాలిక చాకచక్యంతో తప్పించుకొని పోలీసులను ఆశ్రయించడంతో.. ఆ తల్లికి సరైన శిక్షను విధించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రస్తుత కాలంలో సమాజంలో పరిస్థితులు బాగాలేవని కొందరు అంటుండగా.. ఇంట్లోనే కొందరు ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని కొన్ని సంఘటనలను భట్టి చూస్తే అర్థమవుతోంది. రక్షణ ఉండాల్సిన వారే.. మృగంలా ప్రవర్తించడంతో కొందరు అమ్మాయిలు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. ఏ సమస్య ఉన్నా.. అమ్మాయిలు తల్లి వద్దే చెప్పుకుంటారు. కానీ ఓ తల్లే సమస్య కావడంతో ఇక రక్షణ ఎక్కడుంది? అని చర్చించుకుంటున్నారు. నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన శివకుమార్ అనే వ్యక్తికి పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. అయితే అతడికి వసంతపురి యాదమ్మ అనేమహిళతో పరిచయం అయింది. ఆ తరువాత వీరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే అంతటితో ఆగకుండా అతడు ఆమెకు ఉన్న 14 ఏళ్ల కూతురిపై కూడా కన్నేశాడు.
దీంతో ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మించి యాదమ్మను ఒప్పించాడు. ఆ తరువాత ఓ రోజు బలవంతంగా అనుభవించడానికి ప్రయత్నించగా.. బాలిక తిరగబడింది. దీంతో స్థానిక పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు జోక్యం చేసుకొని శివకుమార్, యాదమ్మలపై పోక్సో చట్టం కేసు నమోదు చేశారు. ఈ కేసు కోర్టుకు వెళ్లింది. ఆగస్టు 12న ఈ కేసును విచారించిన న్యాయమూర్తులు యాదమ్మకు 22 ఏళ్ల జైలు శిక్ష వేశారు. అలాగే జరిమానా కింద రూ.10 లక్షలు చెల్లించాలని తీర్పు చెప్పారు. అయితే కోర్టుకు వచ్చిన శివకుమార్.. మూత్ర శాలకు వెళ్లొస్తానని చెప్పి పారిపోయాడు. దీంతో అతడి కోసం గాలిస్తున్నారు.





