కరీంనగర్: వచ్చే స్థానిక ఎన్నికల్లో కురుమలు సత్తా చాటాలని కరీంనగర్ జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు కడారి అయిలన్న సూచించారు. శనివారం ఆయన కరీంనగర్ కలెక్టరేట్ వద్ద గల సంఘం కార్యాలయంలో మీడియా మిత్రులతో మాట్లాడారు. తెలంగాణలో అత్యధిక జనాభా గల కురుమలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అవకాశమున్న ప్రతి పార్టీలో, ప్రతి చోట వార్డ్ మెంబర్, సర్పంచ్ , యం పి టి సి, జడ్పిటిసి, మరియు యం పి పి వరకు అవకాశం ఉన్న ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో పోటీకి సిద్ధం కావాలన్నారు.
గతంతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న కురుమలు అన్ని రంగాలలో అన్ని వర్గాలకు దీటుగా ముందుకు వెళ్తున్నాం అన్నారు. గతంలో రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగాల్లో చాలా వెనుకబడి ఉన్న కురుమలు నేటి యువత విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాలలో అన్ని వర్గాలకు ధీటుగా, సమానముగా ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రభుత్వానికి మనం చెల్లిస్తున్న పన్నుల వాటాను ప్రభుత్వ నుండి కుల పరంగా కాని, వృత్తి పరంగా కాని సాధించుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. దానికి పునాదే రాజకీయ పదవులన్నారు. మన కులవృత్తి అయిన గొర్రెల పెంపకం రోజురోజుకు సరియైన వసతులు లేక క్షీణిస్తున్నందున నేటి కురుమ యువత వృత్తికి దూరమవుచున్నందున అన్ని రంగాలలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నదన్నారు.





