కరోనా మరోసారి కలకలం రేపుతోంది. అమెరికాలో కొవిడ్ రిపీట్ అయినట్లు తెలుస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ కు కోవిడ్ పాజిటివ్ అయినట్లు వైట్ హౌజ్ వర్గాలు తెలిపాయి. గతంలో కరోనా కాలంలో వ్యాక్సిన్ వేయించుకున్నారని, బూస్టర్ డోస్ కూడా తీసుకున్నారని అధ్యక్షుడి ప్రెస్ కార్యదర్శి కరీన్ జిన్ పియరీ తెలిపారు. 81 సంవత్సరాల వయసు ఉన్న జో బైడెన్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఆయన లాస్ వెగాస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వైద్యులు పరీక్షంగా కొవిడ్ పాజిటివ్ అని తేలింది.
కొవిడ్ పాజిటివ్ అయిన కారణంగా బైడెన్ ఐసోలేషన్ కు వెళ్లినట్లు జిన్ పియరీ తెలిపారు.ప్రస్తుతం ఆయన శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. బుధవారం ప్రచారంలో పాల్గొన్న సమయంలో ఉత్సాహంగా ఉన్నారని, ఆ తరువాత ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారన్నారు. అయితే తాను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నవారికి ధన్యవాదాలు అని ట్విట్టర్ వేదికగా జో బైడెన్ తెలిపారు. అలాగే నేను ఆరోగ్యంగా ఉన్నాను.. అని మరో ట్వీట్ చేశారు.
ప్రస్తుతం అమెరికాలో ఎన్నికల వాతావరణం నెలకొంది. త్వరలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జోరుగా ప్రచారం సాగుతోంది. జో బైడెన్ మరోసారి పోటీ పడుతున్నాడు. రిపబ్లిక్ పార్టీ తరుపున ట్రంప్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ట్రంప్ పై జరిగిన కాల్పులు కలకలం రేపిన నేపథ్యంలో ఇప్పుడు జో బైడెన్ కు కొవిడ్ పాజిటివ్ రావడం చర్చనీయాంశంగా మారింది.