భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్టోబర్ 29, 2025న హర్యానాలోని అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి రఫెల్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. ఈ విమానంలో ఇప్పటి వరకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రయాణించగా.. ఆ తరువాత ద్రౌపది ముర్ము ప్రయాణించి తొలి మహిళా రాష్ట్రపతిగా అరుదైన ఘనతను సాధించారు. ఈ ప్రయాణానికి సంబంధించి సమాచార శాఖ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ప్రయాణానికి ముందు, భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్ వారు విమానాశ్రయం వద్ద ఘనంగా సత్కారం అందుకున్నారు.
భారత రాష్ట్రపతి గా రెండేళ్ల క్రితం 2023 ఏప్రిల్ లో అస్సాం లోని తేజ్ పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి సుఖోయి-30 ఎంకేఐ లో మొట్ట మొదటిసారిగా యుద్ధ విమానంలో ప్రయాణం చేశారు. అంతకుముందు సుఖోయ్ యుద్ధ విమానంలో అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్ ప్రయాణించారు. అయితే రఫెల్ యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఘనత సాధించారు.
రఫెల్ యుద్ధ విమానం అనేది ఫ్రాన్స్ కు చెందిన డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ రూపొందించిన 4.5 తరం ట్విన్-ఇంజన్, కనార్డ్ డెల్టా వింగ్ మల్టీరోల్ ఫైటర్ జెట్. ఇది వైమానిక ఆధిపత్యం, నిఘా, భూమి/సముద్ర లక్ష్యాలపై దాడులు, న్యూక్లియర్ డిటరెన్స్ వంటి విస్తృత మిషన్‌లను నిర్వహించగలదు. దీనిని “ఓమ్నిరోల్” విమానంగా పిలుస్తారు, ఎందుకంటే ఇది ఒకే విమానంతో అనేక రకాల యుద్ధ పాత్రలను నిర్వహించగలదు.రఫేల్ గరిష్ట వేగం మాక్ 1.8 వరకు చేరుకోగలదు. 1000 కిలోమీటర్ల వేగంతో పరుగెడుతుంది. ఇది దీర్ఘ దూర మిషన్లను సులభంగా గుర్తిస్తుంది. ఇవి శత్రు రాడార్ లక్ష్యాలను గుర్తించడంలో కష్టతరం చేస్తాయి. ఇది గాలిలో ఇంకా ఇంధనం నింపుకునే సదుపాయం కూడా కలిగి ఉంటుంది. రఫేల్ విస్తృత శ్రేణి ఆయుధాలను మోసుకెళ్లగలదు. ఇందులో SCALP EG (స్టార్మ్ షాడో) క్రూయిజ్ క్షిపణి, HAMMER స్మార్ట్ బాంబులు, MICA, Meteor వంటి ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులు ఉన్నాయి.
భారత వాయుసేన (IAF) 36 రాఫెల్ జెట్లను కలిగి ఉంది. ఇవి దేశ వాయు సామర్థ్యాన్ని గణనీయంగా బలోపేతం చేశాయి. ఇటీవల, భారతదేశం ఫ్రాన్స్ తో ₹63,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకుని 26 రాఫెల్-మరైన్ జెట్లను కొనుగోలు చేసింది. ఇవి విమానాల రవాణా నౌకల నుండి పనిచేయగలవు. ప్రస్తుతం ఐఏఎఫ్ మరియు నేవీ కోసం మరో 114 రాఫెల్ జెట్లను స్థానికంగా తయారు చేయడానికి ప్రతిపాదనలు ఉన్నాయి. దీంతో భారతదేశం వద్ద ఉన్న రఫేల్ జెట్ల సంఖ్యను 176కి పెరిగే అవకాశం ఉంది.





