ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాల అంటే అందరూ చిన్న చూపు చూసేవారు. ఈ పాఠశాలలో చేర్పించడానికి తల్లిదండ్రులు ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ కావాలంటే రాజకీయ నాయకుల నుంచి సిఫార్సు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు కారణం ప్రభుత్వ పాఠశాలలో ఉన్న నాణ్యమైన విద్య అని కొందరు అంటున్నారు. గతంలో కంటే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు, ఉచిత భోజనం వంటి సదుపాయాలు ఉండడంతో చాలామంది ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల విడుదలైన లెక్కల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో 3 లక్షలకు పైగా విద్యార్థులు కొత్తగా అడ్మిషన్ తీసుకుంటే.. ఇందులో ప్రైవేట్ పాఠశాల నుంచి 79 వేల మంది ప్రభుత్వ పాఠశాలలో చేరారు. గత ఏడాది ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా 1.45 లక్షల మంది అడ్మిషన్లు తీసుకుంటే ఈసారి 3 లక్షలకు పైగా అడ్మిషన్లు తీసుకోవడంపై ఆసక్తి రేపుతుంది.
ప్రభుత్వం నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులను చేర్పించడంపై ఛాలెంజ్గా తీసుకున్నారు. ఇందులో కొందరు ఉపాధ్యాయులు కొన్ని ప్రశ్నలను కూడా ఎదుర్కొన్నారు. తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని అంటున్నారు.. కానీ మీ పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి.. అని కొందరు ప్రశ్నించగా.. ఇందుకు ఉపాధ్యాయులు సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. మరి వరంగల్ జిల్లాలోని హవేలీ ఘన్పూర్ మండలం కూచంపల్లి హైస్కూల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శశికుమార్ తమ కుమార్తె కీర్తిని తాను పనిచేస్తున్న పాఠశాలలోనే ఐదవ తరగతిలో చేర్పించారు. అలాగే దుబ్బాక మండలం రామక్కపేటకు చెందిన ముదిగొండ భగవాన్ తన ఇద్దరు కుమార్తెలైన మనస్విని, తేజస్వినీలను తాను పనిచేస్తున్న పాఠశాలలో చేర్పించారు.
ఇలా ఉపాధ్యాయులు సైతం ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని సంకల్పంతో ముందుకు సాగారు. ఈ ఏడాది జూన్ 12న ప్రారంభించిన బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని అవగాహన కల్పించారు. దీంతో చాలామంది ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ దొరకని పరిస్థితి ఏర్పడింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాలలకు గట్టి పోటీ ఇస్తుంది. ఇందులో అడ్మిషన్స్ కోసం సీఎం కార్యాలయం నుంచి సిపార్టీ చేసే పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు మోడల్ స్కూల్ సైతం విద్యార్థులతో కిటకిటలాడుతున్నాయి. ఇటీవల కొన్ని మోడల్ స్కూల్స్లో అడ్మిషన్స్ కోసం రాజకీయ నాయకుల నుంచి సిఫార్సు లేఖలను పంపించారు. అయితే అధికారులు ఆ లేఖలను పట్టించుకోకుండా కేవలం విద్యార్థుల ప్రతిభ ఆధారంగానే అడ్మిషన్లు ఇస్తున్నారు. తాజాగా కొందరు ప్రముఖ రాజకీయ నాయకుల అడ్మిషన్స్ పక్కన పెట్టినట్లు సమాచారం. ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలలు భవిష్యత్తులో ప్రైవేట్ పాఠశాలలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని కొందరు విద్యావేత్తలు అంటున్నారు.