మానవ జన్మ ఎంతో విలువైనది. ఈ జన్మ పొందడానికి ఎన్నో పుణ్యాలు చేసుకోవాలని కొందరు పండితులు చెబుతుంటారు. అలాంటి జన్మ ఇచ్చినందుకు తల్లిదండ్రులకు ఎంతో సేవ చేయాలని సూచిస్తుంటారు. కానీ నేటి కాలంలో రకరకాల కారణాలు చెబుతూ తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. పొద్దనకా.. రాత్రనకా.. కష్టపడి తమ పిల్లలను బాగు చేస్తే.. వారు ఇతర ప్రదేశాల్లో ఉంటూ తల్లిదండ్రులను పట్టించుకోవడం లేని సంఘటనలు బయటపడుతూ ఉన్నాయి. మరో చోట ఆస్తి కోసం కూమారులు తమ తల్లిదండ్రులను రోడ్డున పడేస్తున్నారు. అయితే ఈ పరిస్థితిని బాగా గమనించిన సిక్కిం ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా తల్లిదండ్రులకు సేవ చేస్తే లక్ష రూపాయల నగదు ఇస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే..
2025 ఆగస్టు 15న శుక్రవారం రోజు సిక్కిం ప్రభుత్వం కొత్త పథకంను ప్రకటించింది. దీనిపేరు ‘ శ్రవణ్ కుమార్’(Sravan Kumar Award). ఈరోజున మొత్తం 199 మందికి అవార్డులను అందించింది. అవార్డుల్లో భాగంగా ఎంపికైన వారికి లక్ష రూపాయల చొప్పున అందించింది. వృద్ధులైన తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా చూసుకున్నవారికి.. తల్లిదండ్రులే తమ సర్వస్వం అన్న వారికి ఈ అవార్డులను దానం చేసింది. ఈ అవార్డులను సామాజిక సంక్షేమ శాఖల ద్వారా అందిస్తున్నారు.
‘శ్రవణ్ కుమార్’అని పేరెందుకు పెట్టారు?
పురాణాల ప్రకారం.. రామాయణంలో శ్రవణకుమారుడిది ప్రత్యేక పాత్ర. ఈయన వృద్ధ తల్లిదండ్రులకు జన్మిస్తాడు. అంతేకాకుండా వీరు అంధులు కూడా. వారిని పోషించడం కోసం బాలుడి వయసు నుంచే శ్రవణకుమారుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటాడు. తల్లిదండ్రులు అంధులు కావడం చేత తనతో పాటు నడవలేరని.. వారికి ఒక కావడిలో కూర్చుండబెట్టుకొని తన భుజంపై వేసుకొని వెళ్తాడు. అయితే ఇలా అడవిలో వెళ్తున్న సమయంలో తల్లిదండ్రుల దాహం తీర్చడానికి ఒక కొలను వద్దకు వెళ్తాడు. ఈ సమయంలో అడవిలో వేటకు వచ్చిన దశరథుడు కొలనులో నీళ్లు తీసుకుంటున్న శ్రవణుడిని జింక అని అనుకుంటాడు. దీంతో బాణం వేస్తాడు. అయితే చివరి శ్వాసలో ఉన్న శ్రవణుడి వద్దకు వెళ్లగా తన తల్లిదండ్రుల గురించి చెప్పి వారికి నీరు అందించాలని చెబుతాడు. దశరథుడు ఆ నీరు అంధులైన శ్రవణుడి తల్లిదండ్రులకు ఇస్తే.. తమకుమారుడు శ్రవణుడే అని అనుకుంటారు. అయితే వారికి అసలు విషయం చెప్పగానే.. తమలాగే నీకు కూడా పుత్రశోకం కలగాలని శాపం పెడతారు. ఆ ఫలితమే శ్రీరాముడి స్టోరీ అని అంటారు.
అంటే ఇక్కడ తల్లిదండ్రుల కోసం ఒక కుమారుడు చివరి వరకు ఎంత కష్టాన్నైనా భరించాడని నీతి చెబుతుంది. అందుకే సిక్కిం ప్రభుత్వం తల్లిదండ్రులకు సేవ చేసేవారికి ‘శ్రవణ్ కుమార్’ (Sravan Kumar Award) పథకం పేరిట అవార్డులను అందిస్తోంది.





