దుబాయ్ ఎయిర్ షోలో భారత వైమానిక దళానికి చెందిన అత్యాధునిక యుద్ధవిమానం IAF Tejas అనుకోకుండా ప్రమాదానికి గురైన ఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. భారతదేశం స్వయంగా తయారు చేసిన ఈ జెట్ ప్రపంచస్థాయి ప్రదర్శనలో పాల్గొంటుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఫైలట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రదర్శన చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు.
జెట్ ఎలా ప్రమాదానికి గురైంది?
కొంతమంది వీక్షకులు చెబుతున్న ప్రకారం.. దుబాయ్ లోని అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో జరుగుతున్న దుబాయ్ ఎయిర్ షో 2025 చివరి రోజున తేజస్ జెట్ గాల్లో స్టంట్ చేసేందుకు పైకి వెల్లింది. ఈ సమయంలో అకస్మాత్తుగా ఒక వైపు నుంచి పొగ కనిపించింది. పైలట్ వెంటనే విమానాన్ని నియంత్రించడానికి ప్రయత్నించినా, కొన్ని సెకన్లలోనే బ్యాలెన్స్ కోల్పోయింది. అత్యవసర పరిస్థితిని గ్రహించిన పైలట్ వెంటనే ఎజెక్ట్ సిస్టమ్ ఆన్ చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఫైలట్ అక్కడికక్కడడే మృతి చెందినట్లు భారత వాయుసేన ప్రకటించింది.
అయితే కొంత మంది తేజస్ జెట్ కు ఆయిల్ లీక్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. కానీ ఇది తప్పుడు సమాచారం అంటూ భారత ప్రభుత్వం ఖండించింది. అయితే అసలు కారణం ఏమిటో తెలుసుకోవడానికి ఇప్పటికే సంయుక్త దర్యాప్తు ప్రారంభించారు.
తేజస్ లైట్ కాంబట్ ఎయిర్క్రాఫ్ట్ (LCA)
భారతదేశం రూపొందించిన తేజస్ లైట్ కాంబట్ ఎయిర్క్రాఫ్ట్ (LCA)ఈ ప్రమాదంలో కుప్పకూలింది. ఇది అధిక వేగంగా ప్రయాణించడంతో పాటు ఆధునిక రాడార్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది. శత్రు విమానాలను లక్ష్యంగా చేసుకునే అధిక సామర్థ్యం వంటి ఫీచర్స్ తో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శక్తిని గణనీయంగా పెంచుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తేజస్ ఘటన సహజంగానే ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది.





