ప్రేమను, ఆప్యాయతను మాటల కంటే బలంగా వ్యక్తపరిచే మార్గం హగ్. ఫిబ్రవరి నెలలో జరుపుకునే “హగ్ డే” కేవలం ప్రేమికుల కోసమే కాదు… కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆత్మీయుల మధ్య బంధాన్ని మరింత బలపరచే రోజు. కానీ హగ్ అనేది భావోద్వేగానికే పరిమితం కాదు. ఇది మన శారీరక, మానసిక ఆరోగ్యంపై కూడా విశేషమైన ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
రెగ్యులర్‌గా హగ్ చేసుకోవడం వల్ల రక్తపోటు (బీపీ) నియంత్రణలో ఉండేందుకు సహాయపడుతుంది. మనం హగ్ చేసుకునే సమయంలో శరీరంలో ఆక్సిటోసిన్ అనే “లవ్ హార్మోన్” విడుదల అవుతుంది. ఇది గుండె స్పందనను స్థిరంగా ఉంచి, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఫలితంగా గుండె సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రోజువారీ టెన్షన్‌తో బాధపడేవారికి హగ్ ఒక సహజమైన రిలాక్సేషన్ థెరపీలా పనిచేస్తుంది.
అంతేకాదు, హగ్ చేయడం వల్ల స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసోల్ స్థాయి తగ్గుతుంది. దీంతో మనసు ప్రశాంతంగా మారుతుంది. ఆందోళన, నిరుత్సాహం తగ్గి పాజిటివ్ భావనలు పెరుగుతాయి. ఎండార్ఫిన్లు విడుదల కావడం వల్ల సహజంగా పెయిన్ రిలీఫ్ లభిస్తుంది. తలనొప్పి, కండరాల నొప్పి వంటి చిన్నపాటి సమస్యల నుంచి ఉపశమనం కలగొచ్చు.
రోగనిరోధక శక్తి పెరగడంలో కూడా హగ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఒత్తిడి తగ్గితే శరీర రక్షణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. అందువల్ల జలుబు, జ్వరాలు వంటి సాధారణ ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశాలు తగ్గవచ్చు.
ముఖ్యంగా పడుకునే ముందు ఆత్మీయులను హగ్ చేసుకోవడం వల్ల మెదడు ప్రశాంత స్థితికి చేరుతుంది. భద్రతా భావం పెరిగి నిద్ర వేగంగా పడుతుంది. నిద్ర నాణ్యత కూడా మెరుగవుతుంది. అందుకే నిపుణులు రోజుకు కనీసం నాలుగు సార్లు, ఒక్కో హగ్ కనీసం 20 సెకన్లు ఉండేలా చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఈ హగ్ డే సందర్భంగా మన ఆప్తులను హగ్ చేసి ప్రేమను పంచుకుందాం. ఒక చిన్న హగ్… పెద్ద ఆరోగ్య బహుమతి!





