భారతదేశానికి వెన్నెముక రైతు. మన దేశం 70 శాతం వ్యవసాయ ఆధారితంగా ఉంటుంది. రైతులు కష్టం చేస్తేనే.. దేశానికి ఆహారం దొరుకుతుంది. కానీ నేటి కాలంలో రైతులు పడే కష్టాలు చెప్పలేకుండా ఉన్నాయి. ఒక పంట పండాలంటే పొద్దనకా.. రాత్రనకా.. శ్రమ చేయాల్సి ఉంటుంది. ఇందు కోసం ఎంతో మంది సహాయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ పండిన పంటను కాపాడుకోవాల్సి వస్తుంది.ఆరుగాలం కష్టపడి కాపాడుకున్న పంట చేతికొచ్చేసరికి ప్రకృతి కన్నెర్ర చేస్తే నేల పాలవుతుంది. ఎంత కష్టం ఉన్నా.. ఎంత నష్టం ఉన్నా.. రైతులు వ్యవసాయం చేయడం ఆపడం లేదు. అయితే ఒక్కోసారి చేతికి వచ్చిన పంటను సరైన ధరకు అమ్ముకునే అవకాశం కూడా లేకుండా పోతుంది. ఇలా రైతు పడే కష్టాన్ని ఓ రైతు వీడియోలో తన పాటలో వివరించారు.
ఓ రైతు తాను పండించిన ఆకు కూరలను విక్రయించుకునేందుకు ప్రజల్లోకి వెళ్తాడు. గొంగూర విక్రయించే ఆ రైతు ఒక్కో కట్టకు రూ.10 అని చెబుతాడు. కానీ కొనుగోలు దారులు దానిని రూ.5కే ఇవ్వమని అంటారు. తాను ఎంత కష్టం చేస్తే ఈ పంట వచ్చిందో తెలుసా? అని అంటాడు. అలా అంటూనే ఓ పాటను అందుకుంటాడు. ‘రైతు బతుకులో ఏముంది?’ అని తన కష్టాన్ని ఆవేదనను తెలుపుతాడు. ఆయన చెప్పిన కష్టాన్ని చూసి రైతులు కన్నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నేటి కాలంలో రైతులు పండించే ఆహారాన్ని తింటున్నారు. కానీ వారి కష్టాన్ని గుర్తించడం లేదు. షాపింగ్ మాల్ లో, సూపర్ మార్కెట్లలో ఏదైనా వస్తువు కొనుగోలు చేసే టప్పుడు ఎలాంటి బేరం ఆడరు. అవి నాణ్యతగా ఉంటాయో? లేవో? కూడా తెలియదు. కానీ ఎంతో కష్టం చేసి స్వచ్ఛమైన కూరగాయలను అందించాలని రైతులు నేరుగా తమ పంటలను విక్రయించడానికి వస్తే బేరం ఆడుతారు. అంతేకాకుండా తాము అనుకున్న ధరకు ఇవ్వకపోతే కొనలేరు. అయితే ఈ చిన్న మొత్తమే రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. వారి పంటకు సరైన ఆదాయం వచ్చిందన్న సంతోషం కలుగుతుంది.
అందువల్ల నిజమైన రైతులు తమ పంటను విక్రయించేందుకు ప్రజల్లోకి వస్తే వారితో బేరం ఆడకుండా వారి కష్టాన్ని గుర్తించి సరైన ధర చెల్లించాలని రైతులు కోరుతున్నారు. ఎందుకంటే రైతులు స్వచ్ఛమైన కూరగాయలు, ఆకుకూరలు మాత్రమే తీసుకొస్తారు. చెడిపోయినవి పారేస్తారు. అలాంటి వారికి కాస్త ధర ఎక్కువ చెల్లిస్తే.. వారికి సాయం చేసినట్లే అవుతుంది.. గానీ నష్టం జరిగిందని అనుకోవద్దని అంటున్నారు. ఇటీవల కాలంలో రైతులు పండించిన పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలతో పంటలన్నీ నాశనం అయ్యాయి. ఇలాంటి సమయంలో కూడా గుండె నిబ్బరంతో మరోసారి వ్యవసాయం చేద్దామని అంటున్నారు గానీ.. తప్పుకోవడం లేదు. అటువంటప్పుడు వారికి సహాయంగా ఉండాలని వ్యవసాయ రంగ నిపుణులు తెలుపుతున్నారు.