తెలంగాణలో బోనాల ఉత్సవాలు ప్రతీ ఏడాది వైభవంగా సాగుతాయి. ఆషాఢ మాసం రాగానే హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బోనాల పండుగను నిర్వహిస్తారు. అయితే హైదరాబాద్ నగరంలో జరిగే బోనాల ఉత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 2024 ఏడాది జూలై 7 నుంచి బోనాల ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈసారి ఆషాడ ఆషాఢంలో అమావాస్య జులై 5 న వస్తుంది. ఆ తర్వాత బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. గోల్కొండ లోని ఎల్లమ్మ ఆలయంలో మొదటి పూజ జరిగిన తర్వాత తెలంగాణలోని ఇతర ఆలయాల బోనాలు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. గోల్కొండ తర్వాతనే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ్ మహంకాళి ఆలయంలో పూజలు జరుగుతాయి. ఆషాడ మాసంలో చివరి రోజు గోల్కొండ కోటలోనే చివరి బోనం పూజ జరుగుతుంది. దీంతో బోనాల ఉత్సవాలు సమాప్తం అవుతాయి. గోల్కొండ కోటపై వెలసిన ఎల్లమ్మ( జగదాంబ) ఆలయంలో జులై 7 నుంచి నెల రోజుల వరకు ప్రతి గురువారం ఆదివారం బోనాలు, ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇక్కడ 9 ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలకు నగరం నలుమూలల నుంచే గాక ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ ,మెదక్, నల్గొండ,వరంగల్ ,కరీంనగర్ జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు వస్తారు.