తెలంగాణ రాష్ట్ర మహిళలకు ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలకు ఆర్థిక చేయూతకు రివాల్వింగ్ ఫండ్ డిలీట్ చేసింది. ఇప్పటికే మహిళా సంఘాల ద్వారా మహిళల ఆర్థిక అభివృద్ధికి అనేక పథకాలు ప్రవేశపెడుతున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా రిలీజ్ చేసిన ఈ ఫండ్ తో మరింత భరోసా ఇవ్వనుంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక బలాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం తాజాగా రివాల్వింగ్ ఫండ్ గ్రాంట్ కింద రూ.6.11 కోట్లు రిలీజ్ చేసింది. ఈ నిధులు మొత్తం 4,079 సంఘాలకు వర్తించనున్నాయి. ప్రతి సంఘానికి రూ.15,000 కేటాయించనున్నారు. అసలు ఈ రివాల్వింగ్ ఫండ్ అంటే ఏమిటి?
రివాల్వింగ్ ఫండ్ అనేది మహిళా సంఘాలకు ఇచ్చే ప్రత్యేక నిధి. ఇప్పటికే స్వయం ఉపాధి కింద పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు సైతం ఈ ఫండ్ ఉండేందుకు అర్హులు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళల అత్యవసర ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి వీటిని తీసుకోవచ్చు. అయితే ఇది పూర్తిగా ఉచితం కాదు.. అలాగని సబ్సిడీ కూడా రాదు. అత్యవసరం ఉన్న మహిళలు దీనిని బ్యాంకు లోన్ లాగా తీసుకోవచ్చు. దీనిపై వడ్డీ చెల్లించాలి. అయితే ఒకరు ఉపయోగించుకున్న తర్వాత తిరిగి చెల్లిస్తే.. మరో మహిళ కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఒకరికొకరు ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి ఈ ఫండ్ ఉపయోగపడుతుంది.
ఇలా ఒకరి ద్వారా మరొకరికి ఈ నిధి తిరుగుతుంది. ఇలా ఈ మొత్తం వడ్డీతో సహా పెరుగుతూ సంఘం బలోపేతానికి తోడ్పడుతుంది. అలా జమ అయిన మొత్తం చిన్న వ్యాపారాలు ప్రారంభించాలనుకునే మహిళలకు రుణముగా ఇచ్చే అవకాశం ఉంటుంది.
అయితే ఈ నిధుల ఖర్చుపై అధికారుల పర్యవేక్షణ ఉంటుంది. గ్రామ స్థాయి సమాఖ్యలు ఈ నిధుల వినియోగంపై పరిశీలిస్తారు. ఇవి మహిళల ఆర్థిక అవసరాలు తీరుస్తున్నాయా..? లేదా అనేది పర్యవేక్షిస్తారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారుల ఆధీనంలో ఈ నిధులు జారీ చేయబడతాయి. ఇలా అత్యవసర నిధులతో మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందడమే కాకుండా.. ఉపాధికి తోడ్పాటు అందించడానికి ఉపయోగపడుతుందని అధికారులు తెలుపుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలకు ఈ నిధులు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయని అంటున్నారు.





