నేటి కాలంలో సొంత ఇల్లు ఉండాలని చాలా మంది కోరుకుంటున్నారు. కొత్త ఇల్లు నిర్మాణానికి సమయంతో పాటు ఎక్కువగా ఖర్చు ఉండడంతో కొంతమంది రెడీమేడ్ గా ఉన్న ఇళ్లు కొనుగోలు చేస్తున్నారు. కరోనా తరువాత ఈ పరిస్థితి మరింత పెరిగింది. ప్రజల ఆదాయం తగ్గినప్పటికీ సొంత ఇల్లు కోసం ఎక్కువగా ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ ‘అనరాక్’ వెల్లడించింది. ఈ సంస్థ తెలిపిన ప్రకారం.. దేశంలోని ప్రధానంగా 7 నగరాల్లో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. సగటు ఇళ్ల ధర రూ. 1.23 కోట్లు ఉన్నట్లు తెలిపింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 23 శాతం వృద్ధి నమోదైనట్లు పేర్కొంది.
‘అనరాక్’ అనే సంస్థ తెలిపిన ప్రకారం… 2023 సంవత్సరంలో ఏప్రిల్ సెప్టెంబర్ నెలల మధ్య ముంబయ్, ఢిల్లీ, పూణె, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోల్ కతా అనే 7 నగరాల్లో సగటు ఇల్లు ధర రూ. కోటి గా ఉంది. ఈ ఏడాది ఇదే ఆర్థిక సంవత్సరంలో రూ.1.23 కోట్లకు పెరిగింది. 2024 ఏడాదిలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెలల కాలంలో రూ.2,79,309 కోట్ల విలువైన ఇళ్ల విక్రయాలు జరిగాయి. ఇవి మొత్తం 2,35,800 గృహాలు ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంలో 2,35,200 ఇళ్ల యూనిట్లు విక్రయించగా.. వీటి విలువ రూ.2,35,800 గా ఉంది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోనూ ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇళ్ల ధరలు 37 శాతం పెరిగాయి. 2023 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ఇంటి ధర రూ.84 లక్షల ధర ఉండగా.. 2024 ఏడాదిలో వీటి ధర రూ.1.15 కోట్లకు చేరింది. అయితే గత ఏడాది కంటే ఈ ఏడాదిలో హైదరాబాద్ లో ఇళ్ల విక్రయాలు తగ్గినా.. ధరలు మాత్రం పెరిగాయి. 2023 -24 ఏడాదిలో 29,940 యూనిట్లు ఉండగా.. 2024 ఏడాది ప్రథమ ఆర్థిక సంవత్సరంలో 27, 820 యూనిట్లు ఉన్నాయి. వీటి విలువ రూ.31,993 కోట్లు. అయితే హైదరాబాద్ లో ఖరీదైన ఇళ్లను ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆసక్తిచూపుతున్నారు.
ప్రముఖ నగరాల్లో కొత్త ప్రాజెక్టులు రావడంతో పాటు అభివృద్ధి పెరుగుతున్నందున ఇళ్ల ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. అయితే ఓవరాల్ ఇళ్ల విక్రయాలు పెరిగినా.. హైదరాబాద్ లో మాత్రం స్వల్పంగా తగ్గాయి.