భారతదేశం ఎన్నో పురాతన ఆలయాలకు నిలయం. ఇక్కడ వేల సంవత్సరాల కిందట నిర్మించిన ఆలయాలు కూడా ఉన్నాయి. ఇవి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటున్నాయి. భారతదేశంలోని ఆలయాలను సందర్శించడానిక దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. దేశంలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో పూరిజగన్నాథ్ ఆలయం ఒకటి. ఒడిశా రాష్ట్రంలోని పూరి నగరంలో ఉన్న ఈ ఆలయం చరిత్ర, నిర్మాణం ఆద్యంతం ఆసక్తిని నింపుతాయి. అలాగే పూరిజగన్నాథ్ రథయాత్ర ఎంతో వైభవంగా సాగుతూ ఉంటుంది. ఈ యాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్రలు కలిసి నగర విహార యాత్ర చేస్తారని భక్తుల నమ్మకం. అంతేకాకుండా పూరి జగన్నాథ్ ఆలయంలో దేవతా మూర్తులు రాతి విగ్రహాలతో కాకుండా చెక్కతో తయారు చేసిన విగ్రహాలు ఉంటాయి. ఇలా ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ ఆలయానికి మరో చెప్పుకోదగ్గ విషయం ఉంది. అదే పూరి జగన్నాథ్ ఆలయంపై ఎగిరే జెండా. ఈ జెండా ఒక్కరోజు మార్చకపోతే 18 సంవత్సరాలు ఆలయాన్ని మూసివేయాల్సి వస్తుందట. మరి అలా ఎందుకు? ఆసక్తిని నింపే ఈ స్టోరీ మీకోసం..
సాధారణంగా ప్రతీ హిందూ దేవాలయంపై కాషాయం జెండా ఎగురుతూ ఉంటుంది. ఈ జెండాలను కొన్ని ప్రత్యేక రోజుల్లో మారుస్తూ ఉంటారు. కానీ పూరి జగన్నాథ్ ఆలయంపై ఎగిరే జెండాకు మాత్రం ప్రత్యేకత ఉంది. ఈ జెండాను ప్రతిరోజూ మారుస్తూ ఉండాలి. ఒక్కరోజు ఈ జెండాను మార్చకపోయినా.. అపచారంగా భావించి ఆలయాన్ని 18 సంవత్సరాలు మూసివేయాల్సి వస్తుందట. 800 సంవత్సరాల కిందట అంటే 12వ శతాబ్దంలో ప్రారంమైన ఈ ఆచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అసలెందుకు జెండాను మార్చాలి?

పురాణ కథనం ప్రకారం.. ఒకసారి ఒక భక్తుడి కలలో జగన్నాథ స్వామి కలలో కనిపించాడు. తన ఆలయంపై చిరిగిన, పాత బడిన జెండాను చూసి ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. మరుసటి రోజు ఈ ఆలయం వద్దక ఆ భక్తుడు వెళ్లగా.. అక్కడ నిజంగానే చిరిగిన జెండా కనిపించింది. దీంతో ఈ విషయాన్ని పూజారులకు చెప్పగా.. వెంటనే స్వామివారి గౌరవార్థం నిత్యం జెండాను మారుస్తామని నిర్ణయించారు. అప్పటి నుంచి ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు జెండాను మారుస్తున్నారు.

జెండా విశేషమేంటంటే.. ఇది గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. ఈ జెండాను ‘పటితపావన బాణ’అని అంటారు. పతనమైన వారిని ఉద్దరించేవాడి జెండా అని అర్థం. ప్రతిరోజూ జెండా మార్చే విధానాన్ని ‘ధ్వజ పరివర్తన్’ అని అంటారు. ఈ జెండాను చోళ కుటంబానికి చెందిన వారు మాత్రమే మారుస్తారు. ప్రతిరోజు 214 అడుగుల ఎత్తుకు వెళ్లి సాహసోపేతంగా జెండానను మారుస్తారు. పూరిజగన్నాథ్ ఆలయంపై 11 అడుగుల, టన్ను బరువున్న సుదర్శన చక్రం ఉంటుంది. ఇది ఏ వైపు నుంచి చూసినా ఒకేలాగా కనిపిస్తుంది.





