వర్షాలు విజృంభిస్తున్నాయి. ఎటూ చూసినీ నీరే కనిపించే పరిస్థితి ఉంది. ఇదే సమయంలో విద్యుత్ తీగల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాల కారణంగా విద్యుత్ తీగలు తెగిపడే ప్రమాదముంది. ఇలాంటి పరిస్థితుల్లో పొలాల్లోకి వెళ్లే సమయంలో.. బయటకు వెళ్తున్న క్రమంలో చూస్తూ వెళ్లాలని సూచిస్తున్నారు. ఇదే సమయంలో ట్రాన్స్ ఫార్మర్లు ఉన్న ప్రదేశంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ట్రాన్స్ ఫార్మర్లు ఉన్న ప్రదేశంలో మూత్ర విసర్జన చేసినా ప్రాణాలకు ముప్పు ఉండే అవకాశం ఉంది. అదెలా అంటారా? ఇటీవల జరిగిన ఓ సంఘటనే ఉదాహరణ.
మూత్ర విసర్జన ఎక్కడపడితే అక్కడ చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. సూర్యపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సమీపంలో దంతాల చక్రధర్ అనే వ్యక్తి మూత్ర విసర్జన చేసేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడి ప్రదేశం తడిగా ఉండడంతో విద్యుత్ ప్రవాహం జరిగింది. దీంతో మూత్ర విసర్జన చేసిన వ్యక్తి విద్యుదఘాతానికి గురయ్యాడు. దీంతో స్థానికుల ట్రాన్స్ ఫార్మర్ కు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కానీ ఇంతలో ఆయన మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
వర్షాకాలంలో విద్యుత్ వైర్ల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పొలాల్లోకి వెళ్లే రైతులు, రాత్రి పూట పయనించేవారు చూస్తూ అడుగులు వేయాలని అంటున్నారు. అయితే మూత్ర విసర్జన చేసేటప్పుడు ట్రాన్స్ ఫార్మర్ లాంటివి లేకుండా చూడాలి. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఉన్న ప్రదేశంలో విద్యుత్ ప్రవాహం ఉండే ఛాన్స్ ఉంది. నేల తడిగా ఉన్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతులు చేయడం వంటివి కూడా మానుకోవాలి.





