కరీంనగర్: గణేష్ నిమజ్జన ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి గణేష్ నిమజ్జన ప్రాంతాలైన మానకొండూర్ చెరువు, కొత్తపల్లి చెరువు, చింతకుంట కెనాల్ పరిశీలించారు. నిమజ్జన ప్రాంతాల్లో చేస్తున్న ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణేశ్ నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో భారీకేడ్లు ఏర్పాటు చేయాలని అన్నారు. అవసరమైన మరమ్మతులు తక్షణం చేసేందుకు నిపుణులను అందుబాటులో ఉంచాలన్నారు. చెరువులో బోట్లను, ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో రాత్రి సమయంలో సౌకర్యంగా ఉండేందుకు హై మాస్ట్ లైటింగ్, భక్తులకు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నీటిపారుదల, విద్యుత్, అగ్నిమాపక, పోలీసు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ గణేష్ నిమర్జనం నేపథ్యంలో నగరంలో, నిమజ్జన ప్రాంతాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తామని అన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా దారి మళ్లింపు, వన్ వే వంటి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనం జరిగేలా అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్, సిపి నిమజ్జన ప్రాంతాలను, చెరువు పరిసరాలను డ్రోన్ సాయంతో పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్, వివిధ శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ సమితి నాయకులు రాధాకృష్ణారెడ్డి, రమేష్ విద్యాసాగర్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్, సిపి నిమజ్జన ప్రాంతాలను, చెరువు పరిసరాలను డ్రోన్ సాయంతో పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్, వివిధ శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ సమితి నాయకులు రాధాకృష్ణారెడ్డి, రమేష్ విద్యాసాగర్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.





