ఒక వాహనం ముందుకు వెళ్లాలంటే దానిని నడిపే ఒక డ్రైవర్ కావాలి. బైక్ అయితే రైడర్ అయి ఉండాలి. కానీ డ్రైవర్ లేకుండానే కొన్ని వాహనాలు ముందుకు వెళ్లే విషయాన్ని ఇప్పటి వరకు తెలుసుకున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు కలిసి అమెరికా పర్యటన సందర్భంగా డ్రైవర్ లేకుండా నడిచే వాహనంలో ప్రయాణించారు. అయితే ఇదంటా కేవలం వారి ఆనంద కోసమే అని అనుకున్నారు. కానీ హైదరాబాద్ లో త్వరలో డ్రైవర్ లేకుండా నడిచే వాహనాలను అభివృద్ధి చేయనున్నట్లు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ మేరకు ఆయన రంగా రెడ్డి విద్యార్థులు తయారు చేసిన వితౌట్ డ్రైవర్ వెహికల్ ను పరిశీలించారు.
తాజాగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సంగారెడ్డి జిల్లాలోని ఐఐటీ మండల పరిధిలో ఉన్న హైదరాబాద్ ఐఐటీని సందర్శించారు. టెక్నాలజీ ఇన్నోవేషన్ ఆన్ అటామనస్ నావిగేషన్(టిహాన్) వేదికగా తయారైన డ్రైవర్ రహిత వాహనంలో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను అభినందించారు. ఇటీవల తాము సిలికాన్ వ్యాలీలో డ్రైవర్ రహిత వాహనంలో ప్రయాణం చేశామని అన్నారు. ఇప్పుడు హైదరాబాద్ విద్యార్థులు తయారు చేసిన వాహనం అంతకంటే అద్భుతంగా ఉందన్నారు. త్వరలోనే డ్రైవర్ రహిత వాహనాలు అందుబాటులోకి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
డ్రైవర్ రహిత వాహనాల తయారీలో ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఏరో స్పేస్, సివిల్, మేథమెటిక్స్ విభాగాలకు చెందిన విద్యార్థులు భాగస్వాములయ్యారు. జపాన్ కంపెనీ సుజుకీ సహాయంతో దీనిని తయారు చేస్తారు. ఇందులో లేటేస్ట్ టెక్నాలజీకి చెందిన రాడార్లు, త్రీడీ, అల్గారిథమ్ ను ఉపయోగిస్తున్నారు. ఈ ప్రయోగం కోసం ఐఐటీలో 2 కిలోమీటర్ల ట్రావెల్ రన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాహనం ప్రయాణించేటప్పుడు ఏదైనా అడ్డం వస్తే ఎలాంటి సెన్సార్ ఉపయోగపడుతుందో గుర్తించారు.
ఇప్పటి వరకు దేశంలో తొలిసారిగా పూణెలోని ఐఐటీ కళాశాల విద్యార్థులు డ్రైవర్ లేని ఎలక్ట్రిక్ వాహనాన్నిఆవిష్కరించారు. దీనిని ఏఐ టెక్నాలజీతో రూపొందించారు. మానవ తప్పిదాలతో కొన్ని రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, డ్రైవర్ రహిత వాహనాలతో అలాంటి సమస్యకు చెక్ పెట్టవచ్చని అన్నారు. పూణె విద్యార్థులు తయారు చేసిన వాహనంలో 3 కిలో వాట్ల సామర్థ్యం కలిగిన బ్యాటరీని ఉపయోగించారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ విద్యార్థులు తయారు చేసిన ఈ వాహనం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చూడాలి.