Tuesday, June 24, 2025

ఆ ‘నవ్వును’ను దూరం చేసుకోవద్దు..నేడు సంతోష దినోత్సవం..

ఒక చిరునవ్వు అనంతమైన దుఃఖాన్ని చెరిపి వేస్తుందని అంటారు. కానీ చాలామందికి ఆ చిరునవ్వే నేడు కరువైంది. అందుకే వారంలో ఒకరోజు.. నెలలో కొన్ని రోజులు హ్యాపీగా ఉండే ప్రయత్నం చేయాలని ఇప్పటికీ ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ విషయంపై మరింత అవగాహన తెలిపేందుకు ప్రపంచవ్యాప్తంగా మార్చి 20వ తేదీన సంతోష దినోత్సవం గా జరుపుకుంటున్నారు. మిగతా వాటికి ప్రత్యేక రోజులు ఉన్నట్లే సంతోషంగా ఉండడానికి ఐక్యరాజ్యసమితి లోని సభ్య దేశాలు కలిసి ఒక రోజును కేటాయించారు. 2011లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మానవ సంతోషం ప్రాథమిక లక్ష్యం అని ఒక తీర్మానాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 2013లో దీనిని దినోత్సవం గా ఏర్పాటు చేశారు. అయితే సంతోషంగా ఉండడానికి ఏం చేయాలి? ఎలాంటి పనులు చేయాలి?

ఒకరికి తమ జీవిత భాగస్వామితో ఉంటే సంతోషం.. మరొకరికి కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తే సంతోషం.. ఇంకొకరికి సినిమాలు చూడడం అంటే ఇష్టం.. ఇలా రకరకాల వ్యక్తులు తమకు ఇష్టమైన పనులు చేయడం వల్ల సంతోషంగా ఉంటారు. అయితే నేటి కాలంలో కొన్ని పనులు, డబ్బు సంపాదన కారణంగా నిత్యం బిజీ లైఫ్ ను గడుపుతున్నారు. 24 గంటల్లో కనీసం ఒక్కసారి కూడా నవ్వడం లేదు. ఒక వ్యక్తి రోజులో కనీసం కొన్ని క్షణాల పాటు అయినా సంతోషంగా లేకపోతే అనేక అనారోగ్యాలు సంభవిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల ప్రతిరోజు ఉదయం సంతోషంగా ఉంటే రోజంతా హ్యాపీగా ఉంటారని చెబుతున్నారు. అయితే ప్రతిరోజు మాత్రమే కాకుండా కొన్ని లక్షణాలను దూరంగా ఉంచుకోవడం వల్ల కూడా సంతోషంగా ఉండగలుగుతారు.

వీటిలో ప్రధానంగా చెప్పుకునేది కోపం.. ఈ మధ్య చిన్న పిల్లలకు కూడా అమితమైన కోపం వస్తుంది. వారికి ఏదైనా విషయం చెప్తే తిరిగి పెద్ద వారికే చెప్పే విధంగా తయారవుతున్నారు. అయితే వారు తిని ఆహారంలోనే లోపం ఉందన్న విషయం గుర్తించుకోవాలి. వారు తినే ఆహారంలో ఎక్కువ శాతం సోడియం ఉండడంతోపాటు ఇతర ప్రాసెస్ వల్ల వారి మానసిక ఆందోళన ఎక్కువై కోపానికి గురవుతున్నారు. అయితే పెద్దవారు సాధారణ ఆహారం తీసుకున్న కొన్ని పనుల వల్ల కోపానికి గురవుతారు. ఇలా ప్రతిదానికి చికాకు పడకుండా ఆలోచించే ప్రయత్నాలు చేయాలి. అలా కోపాన్ని దూరంగా ఉంచుకోవడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు.

అహం లేదా ఈగో ప్రాబ్లం వల్ల చాలామంది మానసికంగా ఘర్షణకు గురవుతారు. ఒక వ్యక్తి మీద ఆధిపత్యం చలాయించడానికి రకరకాలుగా ఆలోచిస్తారు. ఈ క్రమంలో వారు హ్యాపీనేస్ కోల్పోతారు. అయితే ఇది ఎప్పటికైనా మంచిది కాదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇగో నీ వీడి సర్దుకుపోవడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో ఈ పరిస్థితి వస్తే బంధాలు దూరం అవడం తో పాటు మానసికంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటారు.

ఇప్పుడున్న కాలంలో చాలామందికి ఈర్ష్య తప్పనిసరిగా ఉంటుంది. ఒక వ్యక్తి ఎదుగుతున్నా.. లేదా తనకంటే బాగున్నాడన్న మరో వ్యక్తి అసలు సహించడం లేదు. అయితే ఈ గుణం ఉండడం వల్ల ఆ వ్యక్తి మాత్రమే లోలోపల మానసికంగా ఆందోళన చెంది అనేక జబ్బులను తెచ్చుకుంటాడు. అందువల్ల ఎదుటివారి గురించి తక్కువగా ఆలోచించి సొంతంగా ఏం చేయాలో ఆలోచించాలి. అలా ఈర్షను దూరం పెట్టడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉండి సంతోషంగా ఉండగలుగుతారు.

ఇవే కాకుండా వీకెండ్ ట్రిప్ లాంటివి వేయడం.. నిత్యం కుటుంబ సభ్యులతో మాట్లాడడం.. మొబైల్ వంటివి దూరంగా ఉంచి ఎక్కువగా కమ్యూనికేషన్ పెంచుకోవడం వంటివి చేయడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇలా ప్రశాంతంగా ఉండడం వల్ల సంతోషంగా జీవిస్తారు. అందువల్ల పై మూడు లక్షణాలు మాత్రమే కాకుండా సంతోషాన్ని దూరం చేసే వాటిని వీడి హాపీగా ఉండాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News