Friday, January 30, 2026

చంద్రుడిని వినాయక చవితి రోజు చూడొద్దు.. సంకష్ట హర చతుర్థి రోజు చూడాలి.. ఎందుకు?

పార్వతీ పరమేశ్వరుల ప్రియపుత్రుడు వినాయకుడు ఆది దేవుడిగా కొలవబడుతున్నాడు. ఏ శుభ కార్యం నిర్వహించినా.. ముందుగా గణేశుడి పూజ చేయాల్సిందే. అయితే వినాయకుడి చరిత్ర ఎంత తెలుసుకున్నా.. తక్కువే అనిపిస్తుంది. ఎలాంటి కోరికలైనా ఇచ్చే విఘ్నేశ్వరుడు అంటే ఏ దేవుడైనా నమస్కరిస్తారు.. ప్రత్యేకంగా గౌరవం ఇస్తారు. కానీ వినాయకుడు, చంద్రుడి మధ్య వైరం ఉందన్న విషయం తెలిసిందే. అందుకే వినాయక చవితి రోజు చంద్రుడిని చూడొద్దని అంటారు. అయితే ఇదే వినాయకుడి ప్రత్యేక రోజు అయినా సంకష్ట హర చతుర్థి రోజున చంద్రుడిని చూసిన తరువాతే ఉపవాసం విడిచిపెట్టాలని చెబుతారు. అసలు ఈ తేడా ఎందుకు? అసలేంటీ స్టోరీ?

వినాయక చవితి రోజు ఎందుకు చూడకూడదు?

ప్రతీ ఏడాది భాద్రపద మాసం శుక్ల పక్షచతుర్థిరోజున వినాయక చవితి వస్తుంది. ఈరోజున వినాయక పుట్టిన రోజు అని చెబుతారు. వినాయక చవితి సందర్భంగా గణేశుడి విగ్రహాలను నెలకొల్పి నవరాత్రులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తరువాత గంగమ్మ ఒడికి చేరుస్తారు. అయితే వినాయక చవితి రోజున ఎంతో మంది దేవుళ్లను కొలుస్తారు. కానీ చంద్రుడిని మాత్రం చూడొద్దని అంటారు. చంద్రుడిని చూడడం వల్ల నీలాప నిందలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. వినాయకుడి పుట్టిన రోజు సందర్భంగా దేవతలంతా ఆ స్వామికి ప్రసాదాలు తీసుకువస్తారు. వీటిని చూసి నోరూరిన లంబోదరుడు వాటిని పుష్టిగా ఆరగిస్తాడు. అయితే ఈ సమయంలో గజాననుడు నడవడానికి ఇబ్బంది పడుతాడు. ఈ సమయంలో చంద్రుడు వినాయకుడిని చూసి నవ్వుతాడు. దీంతో గణపతి పొట్ట పగిలి అందులోని ప్రసాదాలు బయటకు వస్తాయి. ఇది చూసిన విఘ్నేశ్వరుడు ఆగ్రహం చెంది నన్ను చూసి నవ్వుతావా.. నిన్ను చూసిన ప్రతీ ఒక్కరూ నీలాప నిందలు పడు గాక.. అని శాపం పెడుతాడు. దీంతో ఎవరికీ కనిపించకుండా చంద్రుడు నీళ్లలో దాక్కుంటాడు. అయితే చంద్రుడి సతీమణి పరమేశ్వరుడి వద్దకు వెళ్లి విలపించగా.. దేవతలంతా కలిసి చంద్రుడిని క్షమించాలని వినాయకుడిని కోరుతారు. అయితే శాపం వెనక్కు తీసుకోలేను గానీ.. వినాయక చవితిరోజు మాత్రం నిన్ను చూసిన వారికి నిందలు తప్పవు అని అంటాడు. అలా చవితిరోజున చంద్రుడిని చూడొద్దని అంటారు.

సంకష్ట హర చతుర్థి రోజు ఎందుకు చూడాలి?

అయితే ప్రతీ నెలలో కృష్ణ పక్షంలో సంకష్ట హర చతుర్థి జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజు వినాయకుడి వ్రతం ఆచరిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి గణనాథుడిని సేవిస్తారు. అయితే రాత్రి వరకు ఉపవాసం ఉండి చంద్రుడి దర్శనం అయిన తరువాతే ఉపవాసం విడిచిపెట్టాలని పండితులు చెబుతున్నారు. అయితే ఈరోజు చంద్రుడిని చూడడానికి అర్థం ఉంది. వినాయకుడి పొట్టను చూసిన తరువాత చంద్రుడు నవ్వి.. శాపానికి గురవుతాడు. దీంతో చంద్రుడిని చూస్తే నీలాప నిందలు పడుతాయని ఎవరూ చూడరు. తనను ఎవరూ చూడడం లేదని బాధపడిన చంద్రుడు నీళ్లలో దాక్కూంటాడు. దీంతో లోకానికి చంద్రోదయం లేక అల్లకల్లోలం అవుతుంది. చల్లదనాన్ని కోల్పోతుంది. అయితే చంద్రుడి కోసం భార్య రోహిణితో పాటు పార్వతి, పరమేశ్వరుడులు దేవగణాలు కలిసి గణేశుడిని శాంతించాలని పూజలు చేస్తారు. చివరికి గణేశుడి విగ్రహం ఏర్పాటు చేసి గరికను సమర్పించడం ద్వారా వినాయకుడు శాంతిస్తాడు. దీంతో చంద్రుడిని వినాయకుడు క్షమిస్తాడు. చంద్రుడిని క్షమించిన రోజు కృష్ణపక్షం చతుర్థి. ఈరోజు సంకష్ట హర చతుర్థిగా పిలవబడుతుంది. ఈరోజున వినాయకుడి వ్రతం చేసి.. ఆ తరువాత చంద్రుడికి ఆజ్యం పోస్తేనే వ్రతం పూర్తవుతుంది.. ఈరోజు చంద్రుడిని చూడకపోతే వ్రతం ఫూర్తవదు.. అని వినాయకుడు లోకానికి చెబుతాడు.

వినాయకునికి చవితి రోజు ఎవరైతే పూజిస్తారో వారు కోరుకున్న వరాలు ఇస్తాడు. సంకస్ట హర చతుర్థి రోజు ఎవరైతే వ్రతం చేస్తారో.. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.. కష్టాలు తొలగిపోతాయని వినాయకుడు చెబుతాడు. ఇలా చవితి రోజు చంద్రుడిని చూడొద్దు.. సంకష్ట హర చతుర్థి రోజు చంద్రుడిని చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News