జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. ఒకప్పుడు పాకిస్తాన్ పార్లమెంట్ సభ్యుడిగా సేవలందించిన ఆయన ఇప్పుడు ఇండియాలో ఐస్ క్రీం అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. సాధారణంగా ఒక్కసారి సర్పంచ్ అయితేనే జీవితాంతం బతికేలా సంపాదిస్తున్నారు. మరి ఈయన ఇలా మారడానికి కారణం ఏంటీ? ఆయన పాకిస్తాన్ నుంచి ఇండియాకు ఎందుకు వచ్చాడు? ఆయన కథ ఒక వ్యక్తిగత పోరాటం మాత్రమే కాదు.. మానవ హక్కులు ఆత్మగౌరవం కోసం చేసిన ప్రయాణం కూడా…
దబాయా రామ్ అనే వ్యక్తి పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో లాహ్య జిల్లాకు చెందిన హిందూ సమాజానికి చెందినవారు. 1988లో మైనారిటీ క్వోటా ద్వారా పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సభ్యుడిగా (MP) ఎంపికయ్యారు. ఆయన పార్టీతో పాటు అనేక సామాజిక కార్యక్రమాలలో పాల్గొని, అక్కడి హిందూ ప్రజల హక్కుల కోసం పోరాడారు. కానీ కాలక్రమేణా ఆ పోరాటమే ఆయన జీవితానికి ప్రమాదంగా మారింది.మత మైనారిటీలపై పెరుగుతున్న ఒత్తిడి, బలవంతపు మత మార్పులు, హింసా సంఘటనలు ఆయన కుటుంబాన్ని భయాందోళనకు గురి చేశాయి. ఆయనను మతం మారాలని ఒత్తిడి తెచ్చారు. అంతేకాకుండా ఆయన పేరును దబాయా రామ్ నుంచి అల్లా దబాయాగా మార్చారు. ఆయన చెబుతున్న ప్రకారం, “నా కుటుంబ సభ్యురాలైన బాలికను బలవంతంగా అపహరించి వివాహం చేశారు. అప్పుడే పాకిస్తాన్‌లో మాకు స్థలం లేదని తెలిసింది” అని పేర్కొన్నారు. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లినా ఫలితం లేకుండాపోయింది. దీంతో ఆయన కుటుంబం ప్రాణాల భయంతో దేశం విడిచి వెళ్లాలని నిర్ణయించింది.

దబాయా రామ్ 2000లో తన కుటుంబంతో కలిసి భారతదేశానికి వలస వచ్చారు. ప్రారంభంలో టూరిస్ట్ వీసాతో హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లా రతన్ గఢ్ లో స్థిరపడ్డారు. అక్కడ మొదట చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం ప్రారంభించారు. తర్వాత జీవనాధారంగా ఐస్‌క్రీం, కుల్ఫీ అమ్మే వ్యాపారం మొదలుపెట్టారు. రోజుకు కొద్దిపాటి ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తూ, ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. ఆ తరువాత ఆయన కుటుంబ సభ్యులలో కొందరు భారత పౌరసత్వం పొందారు. అయితే, ఆయన ఇంకా Citizenship Amendment Act (CAA) క్రింద పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. పాకిస్తాన్‌లో ఎంపీగా పనిచేసిన ఆయన ఇప్పుడు సాధారణ జీవితాన్ని గడుపుతున్నప్పటికీ, మనసులో శాంతి ఉందని చెబుతున్నారు.





