కార్తీక మాసంలో పెళ్లిళ్ల జోరు విపరీతంగా ఉండబోతుంది. ఇప్పటికే శుభముహూర్తాలు ఉండడంతో చాలా చోట్ల పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అయితే నవంబర్ 1 నుంచి వరుసగా శుభముహూర్తాలు ఉండనున్నాయి. నవంబర్ 2,3,6,8,12,13,16,17,18,21,22,23,25,30 తేదీల్లో శుభముహూర్తాలు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రోజుల్లో శుభకార్యాలు నిర్వహించుకోనున్నారు. ముఖ్యంగా ఈ తేదీల్లో పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. అయితే పెళ్లి సీజన్ కారణంగా దేశంలో కోట్ల వ్యాపారం టర్నోవర్ అవతోందని కొన్ని ఆర్థిక సంస్థలు తెలుపుతున్నాయి. ఇందులో భాగంగా CAIT Research and Trade Development Society (CRTDS) దేశంలో 6.5 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం అవుతుందని అంచనా వేసింది.
2025 నవంబర్ 1 నుంచి దేశ వ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కాబోతుంది. ఈ సీజన్ దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ప్రాప్తి తీసుకురానుందని CAIT Research and Trade Development Society (CRTDS) ప్రకటించింది. ఈ సీజన్ 45 రోజుల్లో 46 లక్షల వివాహాలు జరుగుతాయని.. దీంతో దేశ వ్యాప్తంగా దాదాపు 6.5 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం అవుతుందని తెలిపింది. అలాగే కోటి మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంది. వీటిలో ప్రధానంగా అర్చకులు, అలంకరణ, ఆహారపు సరఫరా, రవాణా, ఫొటోగ్రాఫర్లు, ఆర్టిస్టులకు భారీగా ఆదాయం సమకూరనుంది. గత సంవత్సరంలో పోలిస్తే ఇప్పుడు వివాహాల సంఖ్య ఎక్కువగా లేనప్పటికీ పెళ్లికి అయ్యే ఖర్చులు మాత్రం పెరిగిపోయే అవకాశం ఉందని అంటున్నారు. CAIT సెక్రటరీ జనరల్, చాందినీ చౌక్ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ ఈసారి ఆభరణాల ధరలు, వస్తువుల ధరలు పెరరగడంతో రికార్డు స్థాయిలో ఆదాయం టర్నోవర్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు.
అయితే పెళ్లి ఖర్చులో ఆయా రంగాలు కొన్ని వాటాలను కలిగే అవకాశం ఉంది. ఇందులో 15% వరకు జువెల్లరి రంగం అతిపెద్ద ఆదాయంను కలిగి ఉంది. పెళ్లి దుస్తులు సుమారు 10 నుంచి 15 శాతం వరకు ఉండనుంది. ఇది బ్రైడ్ వేర్, డ్రెస్ డిజైనర్లకు పెద్ద ప్రయోజనం కలుగుతాయి. హాస్పిటాలిటీ అంటే ఫంక్షన్ హాళ్లు, బంకెట్ హాళ్లకు సుమారు 30% వ్యాపారాన్ని కలిగే అవకాశం ఉంది. హోటల్స్, హెరిటేజ్ సైట్లు, ఫాం హౌజ్ లు కూడా బుకింగ్ అయ్యే అవకాశం ఉంది. విందులు, కేటరింగ్ సేవలు పెళ్లి వ్యాపారంలో రెండవ అతిపెద్ద భాగాన్ని కలిగి ఉంటాయి. వీటిపై 25-30% ఖర్చు చేస్తారు. దీంతో ఆయా రంగాల వారికి ఆదాయం సమకూరనుంది. వెడ్డింగ్ ప్లానర్స్, డెకరేటర్స్, ఫ్లోరిస్ట్స్ వంటి సేవలు దాదాపు 15% అదనంగా వ్యాపారం అయ్యే అవకాశం ఉంది. ఫొటోగ్రాఫీ, వీడియోగ్రఫీ సినిమాటిక్ షూటింగ్ వంటి సేవలు దాదాపు 10% వ్యాపారం కలిగి ఉంటాయి. డిజిటల్ వ్యాపారం, వెడ్డింగ్ యాప్స్, వర్చువల్ ప్లాట్‌ఫార్మ్స్ 10% ఖర్చు అవుతాయి. ఫిట్‌నెస్, బ్యూటీ ట్రీట్‌మెంట్స్, ట్రావెల్, లాజిస్టిక్స్, గిఫ్ట్స్, స్టేషనరీ వంటి వాటికి మిగిలిన 5-10% ఖర్చు చేస్తారు. దీంతో ఈ రంగాల వారి ఆదాయం పెరగనుంది.
ఇలా దేశవ్యాప్తంగా ఈ పెళ్లిళ్ల సీజన్ లో 6.5 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం అవుతుందని CAIT తెలిపింది. అలాగే ఈ రంగాల్లో పనిచేసేవారు లేదా.. తాత్కాలికంగా కొందరికి ఉపాధి లభించే అవకాశం ఉందని ఈ సంస్థ తెలిపింది. అలా కోటి మందికి అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాకుండా ఈ సీజన్ తో ప్రభుత్వానికి 75 వేల కోట్ల ఆదాయపు పన్ను సమకూరే అవకాశం ఉందని అంచనా వేసింది.





