చిన్నపిల్లలకు అన్నం తినిపించాలన్నా.. ఏడిచే పిల్లలకు ఏదైనా ఒక పాట పాడి ఊరుకుంచాలని అనుకున్నా… టక్కున గుర్తుకు వచ్చే పాట.. ‘ చిట్టి చిలకమ్మా.. అమ్మ కొట్టిందా..?’దాదాపు 60 ఏళ్ల పాటు ఈ పాట తెలుగువారి ఇళ్లల్లో వినిపిస్తూనే ఉంది.. నేటి ట్రెండ్ కు తగ్గట్టుగా సోషల్ మీడియాలోనూ చిట్టి చిలకమ్మా పాటే హైలెట్ గా నిలుస్తుంది. మరి ఈ చిట్టి చిలకమ్మా పాట ఎలా పుట్టింది? ఎవరు పాడారు? ఈ ఆసక్తికర స్టోరీ మీకోసం..
ఒకప్పుడు పిల్లలకు చదువు చెప్పడానికి సరైన సౌకర్యాలు లేవు. ప్రకృతిలో ఉండే చెట్లు, పక్షులు, జంతువులను ఆధారంగా చేసుకొని చదువు చెప్పేవారు. అలా తెలంగాణలోని ప్రస్తుత జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కట్కూరు గ్రామానికి చెందిన బల్ల సరస్వతి గారు.. చిలకలను ఆధారంగా చేసుకొని ‘ చిట్టి చిలకమ్మా’అనే పాటను సృష్టించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నెక్కొండ పరిధిలో గురజాల గ్రామం ఉండేది. ఈ గ్రామానికి 1962లో ఆమె ప్రైమరీ స్కూల్ టీచర్ గా చేరారు. అయితే అక్కడున్న పిల్లలకు చదువు చెప్పడానికి ఎలాంటి పరికరాలు, వస్తువులు లేవు. దీంతో ప్రకృతిలో ఉన్న కొన్ని పక్షులను ఆధారంగా చేసుకొని కథలు చెప్పాలని అనుకున్నారు. ఈ క్రమంలో చిన్నారులు ఆ సమయంలో రోజు చూసే చిలకలపై పాట చెప్పాలని అనుకున్నారు. అలా ఈ పాటను సృష్టించి పిల్లలకు అర్థమయ్యేలా వివరించారు. అప్పటినుంచి ఈ పాట ఆ నోట ఈ నోట.. ఇప్పటికీ పాడుతూనే ఉంది. సోషల్ మీడియాలోనూ ‘ చిట్టి చిలకమ్మా’ పాట ట్రెండీ గా ఉంటుంది.

ఒకప్పుడు ఏడవ తరగతి పాస్ అయితే టీచర్ జాబ్ వచ్చేది. అలా 1957లో ఏడవ తరగతి పూర్తి చేసిన బల్ల సరస్వతి గారికి 14 ఏళ్ల వయసులోనే వివాహం అయింది. పియుసి చదివిన భర్త తో పాటు సరస్వతి గారు టీచర్ ఉద్యోగం పొందారు.. 37 ఏళ్ల పాటు టీచర్ గా పని చేసిన ఆమె ప్రధానోపాధ్యాయురాలుగా పదవి విరమణ పొందారు.
ఒకప్పుడు పుస్తకాల కంటే ప్రాక్టికల్స్ తోనే ఎక్కువగా పాఠాలు బోధించేవారు. అయితే ఇవి ఎక్కువగా కథల రూపంలో ఉండేవి. ఇలా చిట్టి చిలకమ్మా కథ ఇప్పటికీ ఆకట్టుకుంటుంది. ప్రతి తెలుగు ఇంట్లో ఈ పాట కచ్చితంగా వినిపిస్తుంది. చిన్నపిల్లలు సైతం ఈ పాటను వినడానికి ఎంతో ఇష్టపడతారు.





