తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు పథకాలను ప్రారంభించింది. వాటిలో ‘గృహ జ్యోతి’ ఒకటి. ఈ పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ను పొందవచ్చు. ఈ విద్యుత్ గృహ వినియోగదారులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. 200 యూనిట్ల కంటే తక్కువగా విద్యుత్ ను ఉపయోగిస్తే ఒక్క రూపాయి బిల్లు కట్టనక్కర్లేదు. అంతకుమించి ఒక్క యూనిట్ పెరిగినా విద్యుత్ బిల్లు మొత్తం చెల్లించాల్సిందే.
గృహజ్యోతి పథకంపై ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులను మళ్లీ ఆహ్వానిస్తున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఈమేరకు బుధవారం ఆయన విద్యుత్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు అన్నీ అర్హతులుండి ప్రయోజనం పొందని వారు మళ్లీ దరఖాస్తుల చేసుకోవాలన్నారు. అయితే దరఖాస్తులు ఎప్పటి నుంచి స్వీకరిస్తారు? అనేది అయోమయంగా మారింది.
గృహ జ్యోతి పథకం కోసం అంతకుముందు ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు తీసుకునేవారు. ఆ సమయంలో మొత్తం 81,54,158 లక్షల మంది ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 30 శాతం మంది దరఖాస్తులను వివరాలు సరిగా లేవని రిజెక్ట్ చేసింది. మరో 10 లక్షల మందికి రేషన్ కార్డులు లేనందున పథకం వర్తించలేదు. దీంతో ప్రస్తుతం ఈ పథకం కింద 45, 81, 676 మంది ప్రయోజనం పొందుతున్నారు. అయితే కొందరికి అన్ని ధ్రువ పత్రాలు ఉన్నా.. కొన్ని సమస్యల కారణంగా పేరు నమోదు కాలేదు. దీంతో చాలా మంది అర్హత ఉన్నా తమకు ఈ పథకం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం గృహ జ్యోతి పథకం లో సవరణలను ఎంపీడీవో, మున్సిపల్ కేంద్రాల్లో చేస్తున్నారు. కొత్త అప్లికేషన్లు కూడా ఇక్కడే తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.గృహజ్యోతి కోసం దరఖాస్తు చేసుకునేవారు ఆధార్, రేషన్ కార్డు తప్పనిసరి చేశారు. అలాగే సంబంధిత విద్యుత్ బిల్లును సమర్పించాల్సి ఉంటుంది. అద్దె ఇంట్లో ఉన్న వారు సైతం గృహజ్యోతికి అర్హులే.