Sugar Price in India:దేశవ్యాప్తంగా చక్కెర ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దేశీయ మార్కెట్లో చక్కెర సరఫరా, నిల్వలపై ఆందోళనలు పెరగడంతో వీటి ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు వరుసగా పండగలు ఉండటంతో చక్కెరకు డిమాండ్ సాధారణం కంటే పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం చక్కెర ధరలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎంత పెరిగాయో చూద్దాం..
ప్రస్తుతం (ఆగస్టు 18 నాటికి) మిల్లుల వద్ద 100 కిలోల చక్కెర ధర రూ.5,400 నుంచి రూ.5,500 వరకు పలికింది. ఏడాది క్రితం ఇదే పరిమాణం చక్కెర ధర దాదాపు రూ.3,900 వద్ద ఉండేది. అంటే ఏడాది వ్యవధిలో ధరల్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది. తాజా మార్కెట్ పరిణామాలను చూస్తే పండగల సీజన్లో ధరలపై మరింత ఒత్తిడి ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.రిటైల్ ప్రైస్ విషయానికొస్తే.. ఏడాది కింద ఇదే సమయానికి కిలో చక్కెర రూ. 46.34 ఉండేంది. కానీ ఇప్పుడు రూ. 52.3తో విక్రయిస్తున్నారు. అంటే దాదాపు 13 శాతం ధరలు పెరిగాయి.
దేశీయ మార్కెట్లో చక్కెర నిల్వలు తగ్గుతున్నాయి. సాధారణంగా అక్టోబర్, సెప్టెంబర్ ను సీజన్ గా పేర్కొంటారు. అయితే ఇప్పటికే సరఫరా తక్కువగా కనిపిస్తుండడంతో ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. , చెరకు ఉత్పత్తిలో కొంత భాగాన్ని ఇథనాల్ తయారీకి మళ్లించడం కూడా అందుబాటులో ఉండే చక్కెర పరిమాణంపై ప్రభావం చూపుతున్న అంశాల్లో ఒకటిగా పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఆగస్టు నుంచి నవంబర్ వరకు దేశంలో వరుసగా పండగలు ఉండటంతో చక్కెరకు డిమాండ్ సాధారణం కంటే పెరిగే అవకాశం ఉంది. గణేశ్ చతుర్థి, దసరా, దీపావళి వంటి పండగల సమయంలో స్వీట్లు, బేకరీ ఉత్పత్తులు, పానీయాల తయారీలో చక్కెర వినియోగం పెరుగుతుంది. దీంతో ఇప్పటికే పెరిగిన ధరలపై డిమాండ్ మరింత ఒత్తిడి తీసుకురావచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
చక్కెర ధరలు పెరగడం నేరుగా కుటుంబాల నెలవారీ కిరాణా బడ్జెట్‌పై ప్రభావం చూపడమే కాకుండా స్వీట్లు, బేకరీ ఉత్పత్తులు, మిఠాయిలు, కొన్ని పానీయాల ధరలపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా పండగల సమయంలో డిమాండ్ పెరిగే నేపథ్యంలో చక్కెర ధరలపై అందరి దృష్టి నెలకొంది. కేంద్రం తీసుకునే దిగుమతి, నిల్వ, సరఫరా చర్యలే ఈ ధరల పెరుగుదల ఎంతవరకు కొనసాగుతుందో నిర్ణయించనున్నాయి.





