Petrol, Diesel Price Today: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు మరోసారి వేగంగా పెరుగుతున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య తాజా సైనిక ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు ఏర్పడుతున్న ఆటంకాలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సోమవారం బ్రెంట్ క్రూడాయిల్ ధర ఒక్కరోజులోనే 4 శాతానికి పైగా ఎగిసి బ్యారెల్‌కు 79 డాలర్లకు చేరుకుంది. దీంతో భారత్ లో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా? అన్న చర్చ సాగుతోంది. ఆ వివరాల్లోకి వెళితె..
అమెరికా తాజాగా ఇరాన్ లక్ష్యాలపై దాడులు చేపట్టగా, ఇరాన్ కూడా ప్రతిస్పందన చర్యలకు దిగింది. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా రోజూ భారీ స్థాయిలో ముడి చమురు రవాణా జరుగుతుంది. ఈ మార్గంలో ఉద్రిక్తతలు పెరగడంతో సరఫరా అంతరాయం ఏర్పడుతుందనే భయంతో అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా ఎగిశాయి.సోమవారం ట్రేడింగ్‌లో బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 79 డాలర్లకు చేరుకుంది. ఒక్కరోజులోనే దాదాపు 4.3 శాతం పెరుగుదల నమోదైంది. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారితే బ్యారెల్ ధర 80 డాలర్లు దాటి 100 డాలర్ల దిశగా వెళ్లే అవకాశముందని పలువురు అంతర్జాతీయ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
భారత్ తన అవసరమైన ముడి చమురులో 85 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు పెరిగితే దిగుమతి వ్యయం కూడా పెరుగుతుంది. రూపాయి విలువ, రవాణా ఖర్చులు, రిఫైనరీల వ్యయం వంటి అంశాలు కూడా ఇంధన ధరలపై ప్రభావం చూపుతాయి. దీంతో చమురు మార్కెట్లో తాజా పరిణామాలను కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.
ప్రస్తుతం మాత్రం దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈరోజు కూడా పాత ధరలనే కొనసాగించాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు ఎక్కువకాలం 80 డాలర్లకు పైగా కొనసాగితే, భవిష్యత్తులో ఇంధన ధరలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలు, రాష్ట్రాల వ్యాట్, ఆయిల్ కంపెనీల మార్కెటింగ్ మార్జిన్లు వంటి అంశాలు కూడా తుది నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తాయి.
జూలై 13 సోమవారం నాటి పెట్రోల్ ధరల ఇలా ఉన్నాయి..
హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 115.69 డీజిల్ ధర 103.82గా ఉన్నాయి. అలాగే న్యూఢిల్లీలో పెట్రోల్ రూ. 102.12 ఉండగా.. డీజిల్ 95.20తో విక్రయిస్తున్నారు. ముంబైలో పెట్రోల్ రూ. 111.21.. డీజిల్ 97.83.. చెన్నైలో రూ. 107.76 డీజిల్ 99.55 గా ఉంది.





