రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేటలో వెలిసిన శ్రీ సీతారామ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు 700 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ రాతి ఆలయం ప్రాంతీయ ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. రాములవారి కల్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయం భక్తులతో కళకళలాడుతోంది. ఆలయం మొత్తం రాతితో నిర్మించబడింది. గర్భగుడి, ముఖ మండపం వద్ద శిల్పాల నైపుణ్యం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఈ ఆలయంలో నిత్యం అఖండ దీపం వెలగడం విశేషం. ఈ దీపం ఎన్నో తరాలుగా ఆరిపోకుండా కొనసాగుతోంది. అసలు ఈ దీపాన్ని ఎవరు మొదలుపెట్టారు? నిత్యం ఈ దీపం వెలగడానికి కారణం ఏంటీ?
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో సుమారు 700-720 ఏళ్లుగా నిరంతరంగా వెలుగుతున్న అఖండ దీపం (నందా దీపం) భక్తులను ఆకట్టుకుంటోంది. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు (1314 AD) కాలంలో నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ ఆలయం గంటపై చెక్కిన తేదీల ఆధారంగా ఆలయ చరిత్రను గుర్తిస్తున్నారు. ఈ ఆలయం మొత్తం కాకతీయ నిర్మాణ శైలిలో ఉంటుంది.
అఖండ దీపం విశేషాలు
ఆలయ నిర్మాణం పూర్తయిన వెంటనే ప్రతాపరుద్రుడు ఈ దీపాన్ని వెలిగించాడని భక్తుల విశ్వాసం. అప్పటి నుంచి ఈ దీపం వెలుగుతూనే ఉందని స్థానికులు తెలుపుతున్నారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా నూనెను తీసుకువస్తారు. ఈ నూనెను పోయడం వల్ల ఈ దీపం నిరంతరం వెలుగుతూ ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఒక్కోసారి ఈ వత్తిని మారుస్తూ ఉంటారు. ఇలా నిరంతం వత్తిని మారుస్తూ నిరంతం నూనెను ఉంచడం వల్ల దీపం నిర్విరామంగా కొనసాగుతుందని చెబుతున్నారు.
ప్రతి ఏటా శ్రీరామనవమికి ముందు ఇక్కడ తొమ్మిదిరోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ప్రతీ రోజూ స్వామి వారు ఒక్కో వాహనంపై ఊరేగుతారు. ఆ తరువాత శ్రీరామనవమి రోజున కల్యాణం నిర్వహిస్తారు.





