సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు ఇళ్లల్లో సందడి నెలకొంటుంది. వారం రోజులపాటు జరుపుకుని ఈ వేడుకల్లో అనేక సాంప్రదాయ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇళ్ళముందు రంగురంగుల ముగ్గులు, పిండి వంటలు, పతంగులు ఎగురవేయుట.. వంటివి నిర్వహిస్తుంటారు. ఇదే సమయంలో గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల పాటలు అలరిస్తూ ఉంటాయి. అయితే సంక్రాంతి అనగానే హరిదాసులు ఇంటి ముందుకు వస్తుంటారు. కొంతమంది వీరిని చూసి భిక్షాటన చేసేవారు అని అనుకుంటారు. కానీ వాస్తవానికి వారు సంక్రాంతి సమయంలో మాత్రమే ఇళ్లలోకి వస్తుంటారు. వీరిని చూసి భిక్షాటన కోసం వచ్చేవారు అని కాకుండా.. మర్యాదగా ప్రవర్తించాలి. అంతేకాకుండా వారు అలా ఎందుకు వస్తారు? వారు ఇంటికి రావడం వల్ల ఆ ఇంటికి జరిగే శుభ ఫలితాలు ఏంటి?
శ్రీమహావిష్ణువు దశావతారాల గురించి అందరికీ తెలుసు. కానీ మరికొన్ని రూపాల్లో కూడా విష్ణువు భూలోకంలో సంచరిస్తూ ఉంటాడు. అందులో ఈ హరిదాసు రూపం ఒకటి. నారదా మహర్షి, శ్రీ మహావిష్ణువు ఆజ్ఞతో హరిదాసులు సంక్రాంతి సందర్భంగా ఇళ్లలోకి వస్తుంటారు. అయితే వీరు ప్రతి ఇంటి వైపు వచ్చి తిరిగి చూడకుండా వెళ్తారు. అలా చూడకుండా వెళ్లడం వెనుక ఒక కారణం ఉంది.
హరిదాసులు ఎవరైనా రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుంటారు. సంక్రాంతికి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈసమయంలో హరిదాసులు ధర్మ మార్గం గురించి పాటల రూపంలో సందేశం అందిస్తారు. ఈ పాటలు పాడుకుంటూ ఇంటింటికి వెళ్లి భగవన్నామం జపిస్తూ ఆశీర్వాదాలు ఇస్తారు. ఇంటింటికి వెళ్లేవారు తక్కువగా ఉంటారు. అలా ఇంటికి వచ్చినప్పుడు వారితో మర్యాదగా ప్రవర్తిస్తూ.. వారికి బియ్యం పోయడం ఆనవాయితీ. అలా చేస్తే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు లేదా నారద మహర్షికి దానం ఇచ్చినట్లే అవుతుందని కొందరు పండితులు చెబుతున్నారు. అయితే హరిదాసులకు ఎవరైనా దానం చేసినప్పుడు వారు తిరిగి చూడకుండా వెళ్తారు. ఒక ఇంటిలో దానం ఇచ్చినప్పుడు ఆ ఇంటికి సంబంధించిన నెగటివ్ ఎనర్జీ ని హరిదాసులు తీసుకుంటారు. అలా తీసుకున్న నెగెటివ్ ఎనర్జీని తిరిగి చూస్తే మళ్లీ ఇంటివైపే వెళుతుంది. అలా వెళ్లకుండా ఉండడానికి హరిదాసులు వెనక్కి తిరగకుండా వెళ్తుంటారు.
అందువల్ల హరిదాసులు ఇంటికి వస్తే వారిని యాచకులుగా భావించకుండా దైవ ప్రతినిధులుగా భావించి వారికి అవసరమైన దానం చేయాలి. అలాగే వారితో మర్యాదగా ప్రవర్తించడం వల్ల సాక్షాత్తు మహావిష్ణువుకు సేవ చేసినట్లే అవుతుందని చెబుతున్నారు.హరిదాసులు ఇంటికి వస్తే బియ్యం,పప్పులు,నువ్వులు,బెల్లం వంటివి దానం ఇవ్వొచ్చు.





