Friday, January 30, 2026

New Year 2026 అలర్ట్ : మీ మొబైల్ లోకి గ్రీటింగ్ మెసేజ్ వచ్చిందా?

కొత్త సంవత్సరం సందర్భంగా చాలా మంది శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉంటారు. ఒకప్పుడు గ్రీటింగ్ కార్డుల ద్వారా విషెష్ చెప్పుకునేవారు.కానీ ఇప్పుడు మొబైల్ నుంచి ఆన్ లైన్ లో మెసెజ్ లు పంపుతూ ఆకర్షిస్తున్నారు. కొందరు ఆకట్టుకునే విధంగా ఫొటోలతో శభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకున్న కొందరు సైబర్ నేరగాళ్లు తమ మోసాలకు వేదికగా మార్చుకుంటున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ సర్వీస్ (TGCSS) ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఈమెయిల్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా “Happy New Year”, “New Year Gift”, “2026 Greeting Card” పేర్లతో వచ్చే లింకులు, ఫైల్స్ ప్రమాదకరంగా మారుతున్నాయని అధికారులు తెలిపారు.

సైబర్ మోసాల వల్ల జరిగే నష్టం

ఈ తరహా గ్రీటింగ్ లింకులు లేదా ఫైల్స్‌ను ఓపెన్ చేసిన వెంటనే మొబైల్ లేదా కంప్యూటర్‌లో మాల్వేర్ ఇన్‌స్టాల్ అయ్యే ప్రమాదం ఉంది. దీని ద్వారా బ్యాంక్ అకౌంట్ వివరాలు, OTPలు, సోషల్ మీడియా పాస్‌వర్డ్లు, వ్యక్తిగత ఫొటోలు వంటి సున్నిత సమాచారం హ్యాకర్ల చేతికి వెళ్లే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు అకౌంట్ల నుంచి డబ్బు మాయం కావడం, సోషల్ మీడియా అకౌంట్లు హైజాక్ కావడం వంటి నష్టాలు జరుగుతున్నట్లు సైబర్ అధికారులు చెబుతున్నారు.

కొత్త సంవత్సరం గ్రీటింగ్ లు పంపే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తెలియని నంబర్ల నుంచి వచ్చే గ్రీటింగ్ లింకులు, APK ఫైల్స్, వీడియో ఫైల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదు. “Click here”, “Open gift”, “Claim reward” వంటి ఆకర్షణీయమైన మాటలతో వచ్చే మెసేజ్‌లను నమ్మరాదు. అవసరమైతే పంపిన వ్యక్తిని ప్రత్యక్షంగా లేదా కాల్ చేసి నిర్ధారించుకోవాలి.

ఈ ఫైల్స్ ఓపెన్ చేయకుండా ఉండాలి

.apk, .exe, .zip, .rar వంటి ఫైల్స్, అనుమానాస్పద లింకులు, షార్ట్ URLలు (bit.ly వంటివి) ప్రమాదకరంగా ఉండే అవకాశం ఎక్కువ. మొబైల్‌లో యాంటీ వైరస్ అప్లికేషన్‌ను అప్‌డేట్‌గా ఉంచుకోవడం, రెండు దశల భద్రత (Two-factor authentication) ఉపయోగించడం మంచిది. కొత్త సంవత్సరం ఆనందం సురక్షితంగా ఉండాలంటే, అప్రమత్తతే ఉత్తమ రక్షణ అని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ సర్వీస్ సూచిస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News