పూజల్లో దీని ప్రాముఖ్యత ఎలా ఉంటుంది?
భారతీయ సంప్రదాయ పూజా విధానాల్లో దీపానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ దీపాన్ని వెలిగించేందుకు ఉపయోగించే వత్తి కూడా అంతే పవిత్రమైనదిగా భావిస్తారు. ఆ వత్తిని పవిత్రంగా సేకరించిన పూజకు ఉపయోగిస్తారు. అయితే ఇప్పటి వరకు దీపం వెలిగించడానికి పత్తి చెట్ల నుంచి వచ్చిన లేదా బట్టతో తయారు చేసిన వత్తిని మాత్రమే వాడేవారు. కానీ అరుదైన, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన వత్తుల్లో పాండవ బత్తి ఒకటి. ఇది సాధారణ పత్తి వత్తిలా కాకుండా, ప్రకృతి నుంచి లభించే ఆకులతో తయారయ్యే దీప వత్తి.
పాండవ బత్తి అనేది ప్రత్యేకమైన అడవి మొక్క ఆకులతో తయారు చేస్తారు. ఈ ఆకులు ఎండబెట్టి, మడిచి వత్తి ఆకారంలో రూపొందిస్తారు. నూనె లేదా నెయ్యిని బాగా పీల్చుకుని దీర్ఘకాలం మంటతో వెలిగే లక్షణం దీనికి ఉంటుంది. అందుకే పూర్వకాలం నుంచీ దీన్ని పూజలలో ప్రత్యేకంగా ఉపయోగిస్తున్నారు.

పురాణ కథనాల ప్రకారం.. వనవాస కాలంలో పాండవులు అడవుల్లో నివసించిన సమయంలో సాధారణ పత్తి లభ్యం కాకపోవడంతో, ఈ ఆకులతోనే దీపాలను వెలిగించేవారని విశ్వాసం. ఆ కారణంగానే దీనికి పాండవ బత్తి అనే పేరు స్థిరపడిందని భక్తులు నమ్ముతారు. ఈ బత్తితో వెలిగించిన దీపం దైవిక శక్తిని ఆకర్షిస్తుందని, పూజకు ప్రత్యేక ఫలితం ఇస్తుందని నమ్మకం.
పాండవ బత్తి ప్రధానంగా భారతదేశంలోని పశ్చిమ కనుమల ప్రాంతాల్లో సహజంగా లభిస్తుంది. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల అడవీ ప్రాంతాల్లో ఈ మొక్కలు ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడి స్థానిక గిరిజనులు ఈ ఆకులను సేకరించి సంప్రదాయ పద్ధతుల్లో వత్తులుగా తయారు చేస్తారు.
ప్రస్తుతం కూడా పాండవ బత్తిని మహా శివరాత్రి, కార్తీక మాసం, నవగ్రహ పూజలు, హోమాలు, దీపారాధన వంటి ప్రత్యేక సందర్భాల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇది కేవలం ఒక దీప వత్తి మాత్రమే కాదు, ప్రకృతి, పురాణం, భక్తి మేళవించిన ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తోంది.





