భారత రాజ్యాంగంలోని 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం, గ్రామ పంచాయతీలు స్థానిక స్వరాజ్య సంస్థలుగా గుర్తించబడ్డాయి. ఒక గ్రామ అభివృద్ధికి కావాల్సిన నిధులు అనేవి ఒక్క చోటు నుంచే కాకుండా అనేక ప్రభుత్వ వనరుల ద్వారా వస్తాయి. గ్రామ అభివృద్ధి, మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగ కల్పన వంటి ప్రతీ అంశానికి ప్రత్యేక నిధులు ఉండటం ఇది ప్రత్యేకత.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలను నేరుగా పలు పథకాల ద్వారా నిధులు అందిస్తుంది. వీటిలో ప్రధానంగా గ్రామ పంచాయతీ సాధారణ నిధి, పన్ను విభజనలో రాష్ట్ర వాటా, పథకాల కోసం ప్రత్యేక గ్రాంట్లు, శుద్ధి, చెత్త సేకరణ, స్ట్రీట్ లైట్లు, నీటి సదుపాయాల కోసం ప్రత్యేక బడ్జెట్ వంటివి ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వమే పంచాయతీ పరిపాలన, ఉద్యోగుల శాలరీలు, పంచాయతీల నిర్వహణ కోసం ముఖ్యమైన ఆర్థిక వనరులను అందిస్తుంది. గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం తీసుకునే నిర్ణయాల్లో, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే గ్రామపంచాయతీ నిధులు కీలక పాత్ర పోషిస్తాయి.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు
కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ప్రధానంగా ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ద్వారా నిధులు ఇస్తుంది. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. Basic Grants (ప్రాథమిక నిధులు), Tied Grants (పరిమిత ప్రయోజనాల కోసం నిధులు) – నీటి నిర్వహణ, చెత్త వ్యవస్థ, శానిటేషన్ వంటి పనుల కోసం.అదనంగా, కేంద్ర పథకాలు కూడా కీలకంగా ఉంటాయి: మహాత్మా గాంధీ ఉద్యోగ హామీ పథకం (MGNREGA), గ్రామీణ గృహ నిర్మాణ పథకం, జీవనోపాధి మిషన్లు, స్వచ్ఛ భారత్ మిషన్ వంటి పథకాల కోసం నిధులను సమీకరిస్తుంది. ఈ నిధులు నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాలకు వస్తాయి, అయితే ఖర్చు మాత్రం నియమాల ప్రకారం చేయాలి.
గ్రామ పంచాయతీకి వచ్చే స్థానిక ఆదాయం
ఇళ్ల పన్నులు, దుకాణాలు, మార్కెట్లు, పంచాయతీ భవనాలు కిరాయిలు, నీటి పన్నులు, లైసెన్స్ ఫీజులు, బస్‌స్టాండ్లు, ఫెయిర్‌గ్రౌండ్లు వంటి ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం, ఈ ఆదాయం గ్రామ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది
సర్పంచ్, వార్డు సభ్యులకు జీతాలు ఎవరు ఇస్తారు?
సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు ఇచ్చే భృతిని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇది వారి పని బాధ్యతలను గుర్తించడానికి ఇవ్వబడే నెలవారీ అలవెన్స్. గ్రామ పంచాయతీ ఆదాయం లేదా కేంద్ర నిధులతో వీరి జీతాలు చెల్లించరు.





