తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మొదలయ్యాయి. నవంబర్ 25న విడుదలైన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతలుగా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా గ్రామస్థాయి ఎన్నికలంటే ప్రచారం… మైకుల జోరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇదే సమయంలో మద్యం కూడా ఏరులై పారుతుంది. అయితే ఈసారి ఎన్నికలకు మద్యం షాపులకు మంచి కిక్ రానుంది. సర్పంచ్ ఎన్నికల జరగడానికి ముందే కొత్తగా మద్యం షాపులు ఏర్పాటు కావడంతో కొత్తగా మద్యం షాపు నిర్వాహకులు సంబరపడిపోతున్నారు. మరోవైపు ఆరేళ్ల తరువాత సర్పంచ్ ఎన్నికలు జరుగుతుండడంతో ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి.
తెలంగాణ గ్రామీణ రాజకీయాల్లో మద్యం ఓటర్లను ప్రభావితం చేసే సాధనం అన్న మాట కొత్త కాదు. ఎమ్మెల్యే ఎన్నికల కంటే సర్పంచ్ ఎలక్షన్ గ్రామాల్లో జోరుగా ఉంటుంది. గ్రామాభివృద్ధికి నిధులు, స్థానిక ప్రాజెక్టులు, పథకాల అమలులో సర్పంచులే కీలకంగా ఉండనున్నారు. దీంతో అభ్యర్థుల మధ్య పోటాపోటీ ఉండనుంది. ఈ నేపథ్యంలో రాజకీయ వాతావరణం కూడా వేడెక్కనుంది. ఇలాంటి సందర్భాల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి మద్యం పంపిణీ జోరుగా సాగనుంది. అందులోనూ డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం షాపులు ప్రారంభమవ్వడం వలన మద్యం సరఫరా మరింత ఎక్కువ కానుంది.
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కంటే 10రోజుల ముందే అంటే డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం షాపులు ప్రారంభం కానున్నాయి. దీంతో కొత్త ఉత్సాహంతో ఉన్న వ్యాపారులు లాభాల పంట పండించుకునేందుకు రెడీ అవుతున్నారు. సాధారణంగానే కొత్త షాపులకు కావాలసినంత స్టాక్ ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడు ఎన్నికలు కూడా ఉండడంతో రెట్టింపు స్టాక్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికలు ఉండడంతో మద్యం కు విపరీతమైన డిమాండ్ ఏర్పడే అవకాశం ఉన్నందున ముందస్తుగా స్టాక్ బుక్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇంతకుముందు ఎన్నికల విపణిలో చాటు మాటుగా మద్యం సరఫరా ఎక్కువగా ఉండేది. కానీ ఈసారి కొత్త షాపులు అందుబాటులోకి రావడంతో పాటు కొన్ని ప్రదేశాల్లో కొత్తగా మద్యం షాపులు ఏర్పాటు కానున్నాయి. దీంతో గ్రామాల్లో షాపులు ఏర్పాటు చేసే యజమానులు సంబరపడిపోతున్నారు. అయితే ఇదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో మద్యం రేట్లు అనధికారికంగా పెంచే అవకాశం లేకపోలేదని అంటున్నారు.
మద్యం టెండర్ ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చిందన్న వార్తలు వినిపించాయి. ఇదే సమయంలో మద్యం వ్యాపారులకు సర్పంచ్ ఎన్నికలు అదనపు బూస్టును అందించి లాభాల పంటను తీసుకురానున్నాయి. తెలంగాణలో రాబోయే మూడు విడతల సర్పంచ్ ఎన్నికలు అభ్యర్థుల మధ్య పోటీకే కాదు, మద్యం షాపుల ఆదాయ పరంగా కూడా ‘హై డిమాండ్ సీజన్’గా నిలవనున్నాయి.
ఈ నేపథ్యంలో ఓటర్ల ప్రవర్తన ఎలా మారుతుంది? గ్రామాల్లో ఎవరి ఆధిపత్యం కొనసాగుతుంది? రాజకీయ విశ్లేషకుల దృష్టంతా ఇప్పుడు డిసెంబర్‌పై నిలిచింది.





