2009లో ప్రపంచవ్యాప్తంగా 4G టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అదే సమయంలో ‘స్వైన్ ఫ్లూ’వైరస్ (H1N1) ప్రపంచాన్ని వణికించింది. దశాబ్దం తర్వాత 2019లో 5G టెక్నాలజీ ప్రారంభమైన సమయంలో ‘కొవిడ్-19’ మహమ్మారి వ్యాప్తి చెందింది. ఈ రెండు సంఘటనలు సమకాలీనంగా చోటుచేసుకోవడంతో ‘కొత్త నెట్‌వర్క్ వస్తే వైరస్ వస్తుందా..?’అనే సందేహం చాలా మందిలో ఉంటోంది. అంతేకాకుండా దీనిపై ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ సాగుతోంది. అసలు నిజంగానే కొత్త నెట్వర్క్ అందబాటులోకి వచ్చినప్పుడు వైరస్ వ్యాప్తి చెందుతుందా? ఈ అంశంపై శాస్త్రీయ దృష్టితో పరిశీలిస్తే వాస్తవం భిన్నంగా ఉంటుంది.
నెట్‌వర్క్ టెక్నాలజీ అంటే..?
3G, 4G, 5G వంటి టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు డేటా ప్రసారం వేగాన్ని పెంచే టెక్నాలజీలు మాత్రమే. ఇవి రేడియో తరంగాలను (Radio Waves) ఉపయోగిస్తాయి. ఈ తరంగాలు ‘నాన్ అయోనైజింగ్ రేడియేషన్’ లోకి వస్తాయి . అంటే ఇవి మానవ శరీర కణాలను దెబ్బతీయవు. డీఎన్‌ఏను మార్చవు. వైరస్‌లను సృష్టించవు. శాస్త్రీయంగా, రేడియో తరంగాలు జీవకణాలను ప్రభావితం చేయవు.
వైరస్‌లు ఎలా వస్తాయి?
వైరస్‌లు బయాలాజికల్ ఆరెజిన్స్ కలిగిన సూక్ష్మజీవులు. ఇవి జంతువుల నుంచి మనుషులకు (Zoonotic Transmission) వ్యాప్తి చెందుతాయి. ఉదాహరణకు 2009 స్వైన్ ఫ్లూ పందులలో ఉన్న H1N1 వైరస్ మనుషులకు వ్యాప్తి చెందింది. 2019 కోవిడ్-19 చైనాలోని వుహాన్ నగరంలో జంతువుల మార్కెట్ ద్వారా మనుషులకు వ్యాప్తి చెందినట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ఇవేవీ టెక్నాలజీ మార్పుల వల్ల ఏర్పడినవి కావు.
టైమింగ్ యాదృచ్ఛికం మాత్రమే..
కొత్త టెక్నాలజీ లాంచ్ అవుతున్న కాలం, వైరస్ వ్యాప్తి చెందిన కాలం కొన్నిసార్లు ఒకదానికొకటి దగ్గరగా రావడం ‘కోయిన్సిడెన్స్’ మాత్రమే. శాస్త్రీయ పరిశోధనల్లో 5G లేదా 4G నెట్‌వర్క్‌లు వైరస్‌లను సృష్టిస్తాయన్న ఆధారాలు లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), యూరోపియన్ హెల్త్ ఏజెన్సీలు కూడా 5G మరియు కోవిడ్ మధ్య ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా ప్రకటించాయి.
అపోహలు ఎలా వ్యాప్తిస్తాయి?
టెక్నాలజీ మార్పులు సాధారణ ప్రజల్లో భయం, అనుమానం కలిగిస్తాయి. సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం వేగంగా వ్యాప్తి చెందుతుంది. 2020లో కూడా “5G టవర్స్ వల్ల కరోనా వ్యాప్తి అవుతోంది” అనే ఫేక్ థియరీ కారణంగా యుకేలో అనేక మొబైల్ టవర్స్‌కు నిప్పంటించారు. తరువాత ఆ వాదన పూర్తిగా తప్పు అని నిరూపించబడింది.
తేల్చి చెప్పాలంటే
కొత్త మొబైల్ నెట్‌వర్క్ టెక్నాలజీ మరియు వైరస్ వ్యాప్తి మధ్య ఎటువంటి శాస్త్రీయ సంబంధం లేదు. రెండూ వేర్వేరు రంగాలకు చెందిన అంశాలు — ఒకటి ఇంజినీరింగ్, మరొకటి బయాలజీ. సమయసంబంధ యాదృచ్ఛికతను కొందరు అపోహగా మలుస్తారు. టెక్నాలజీ మనిషి జీవన స్థాయిని పెంచుతుందే గానీ, వైరస్‌లను సృష్టించదు. భవిష్యత్తులో అంటే 2030లో 6G వంటి కొత్త నెట్‌వర్క్‌లు వచ్చినప్పటికీ ఇలాంటి అపోహలు తలెత్తే అవకాశం ఉంది. శాస్త్రీయ ఆలోచనతో, ధృవీకరించిన సమాచారంతో ముందుకు సాగితేనే సమాజం అపోహల నుంచి బయటపడగలదు.





