Montha Cyclone ఎఫెక్ట్ తెలంగాణపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ముఖ్యంగా తెలంగాణ లోని వరంగల్ జిల్లాపై భారీ వర్షం కురవడంతో జంట నగరాలు నీటితో నిండిపోయాయి. కనీసం ఐదు గంటల పాటు ఎడతెరిపిలేని వర్షం కురవడంతో ఎటు చూసినా మీరే కనిపించింది. దీంతో హనుమకొండలోని బస్టాండ్ పూర్తిగా నీటితో నిండిపోయింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రైల్వే స్టేషన్లోకి భారీగా నీరు చేరడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. డోర్నకల్ వద్ద రైల్వే ట్రాక్పై భారీగా నీరు చేరడంతో పలు రైలను నిలిపివేశారు. అలాగే రోడ్లపై మోకాలు లోతు నీళ్లు రావడంతో వాహనాలు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. మహబూబాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీ కాల్వకు గండిపడడంతో వాగులు పొంగిపొర్లి ప్రవహించాయి. దీంతో వరి పంటకు తీవ్ర నష్టం జరిగింది.
అలాగే కరీంనగర్ జిల్లాలోనూ భారీ వర్షం కురవడంతో ఎక్కడ చూసినా నీరే కనిపించింది. వెదర్ రిపోర్ట్ ప్రకారం కరీంనగర్ జిల్లాలో హుజరాబాద్ లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. ఇప్పటికే వరి కోసి దాన్యం ఆరబెట్టుకున్న వారికి తీవ్ర నష్టం జరిగింది. ధాన్యం మొత్తం నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు కరీంనగర్ నగరంలో ఐదు గంటల పాటు వర్షం కురవడంతో నగరవాసులు ఇళ్లలో నుంచి బయటకు రాలేకపోయారు.
వాతావరణ శాఖ చెబుతున్న ప్రకారం ఈరోజు కూడా కొన్ని జిల్లాల్లో వర్ష ప్రభావం ఉంటుందని తెలుస్తోంది. గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలో సాధారణ వర్షాలు ఉంటాయన్నారు. మిగతా ప్రాంతాల్లో వర్షాలు తగ్గిన పొడి వాతావరణ ఉంటుందని పేర్కొంటున్నారు.





