బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాను నేపథ్యంలో రెండు పదాలు వినిపిస్తున్నాయి. వీటిలో ఒకటి తీరం తాకిన తుఫాన్.. రెండోది తీరం దాటిన తుఫాన్.. మంగళవారం అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాకు దక్షిణాన నరసాపురం వద్ద తీరాన్ని దాటిందని వాతావరణశాఖ అధికారులు తెలుపుతున్నారు. అంతకుముందు బంగాళాఖాతంలో మొంథా ఏర్పడి నైరుతి బంగాళాఖాతం మీదుగా అంతర్వేది పాలెం వద్ద తీరాన్ని తాకింది అని అంటున్నారు. అసలు తీరం తాకిన తుఫాన్.. తీరం దాటిన తుఫాన్.. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? ఇలా ఎందుకు ఈ పదాలను వాడుతారు?..
తుఫాను ఏర్పడినప్పుడు వాతావరణశాఖ తరచుగా ఉపయోగించే తీరం తాకిన తుఫాన్ అంటే.. తుఫాను సముద్రంలో ఉన్న దశలోనే తన ప్రభావాన్ని తీరప్రాంతంపై చూపించడం. అంటే తుఫాను కేంద్రము ఇంకా పూర్తిగా భూభాగంలోకి రాకపోయినా, దానికి సంబంధించిన గాలి వేగం, వర్షం, అలల ప్రభావం తీరప్రాంతాలను తాకడం ప్రారంభమవుతుంది. ఉదాహరణకు, తుఫాను అంతర్వేది లేదా పాలెం సమీపంలో ‘తీరం తాకింది’.. అంటే, అది భూమికి దగ్గరగా చేరి తన ప్రభావాన్ని చూపుతున్నదన్న అర్థం.
తీరం దాటిన తుఫాన్ అంటే, తుఫాను పూర్తిగా భూభాగంలోకి ప్రవేశించడం. అంటే దాని కేంద్రము సముద్రం నుంచి భూమి మీదుగా ముందుకు సాగిపోవడం. ఈ దశలో తుఫాను గాలి వేగం క్రమంగా తగ్గుతూ వర్షం రూపంలో కొనసాగుతుంది. ఉదాహరణకు, మొంథా తుఫాను నరసాపురం వద్ద ‘తీరం దాటింది’ అంటే, అది పూర్తిగా భూభాగంలోకి ప్రవేశించిందన్న అర్థం.
ఎందుకు ఈ పదాలను వాడుతారు?
వాతావరణశాఖ ఈ రెండు పదాలను తుఫాను దశను తెలియజేయడానికి వాడుతుంది. ‘తాకింది’ అనేది తుఫాను ప్రారంభ ప్రభావ దశను సూచిస్తే.. ‘దాటింది’ అనేది ప్రధాన ప్రభావ దశ ముగిసిన తర్వాతి దశను సూచిస్తుంది. ఇది ప్రజలకు, అధికారులు, రక్షణ బృందాలకు అప్రమత్తత స్థాయిని అంచనా వేయడంలో సహాయపడుతుంది.
తుఫాను ఒక సహజ విపత్తు. అది తీరాన్ని తాకినా లేదా దాటినా, ప్రజల భద్రత ప్రధానమైనది. ముందస్తు హెచ్చరికలను గమనించి, అధికారుల సూచనలను పాటించడం ద్వారా మనం పెద్ద నష్టాలను నివారించవచ్చు. వాతావరణ శాఖ ఇచ్చే ఈ పదాల వెనుక శాస్త్రీయ భావం, ప్రజల ప్రాణరక్షణే ప్రధాన ఉద్దేశం.





