Friday, January 30, 2026

నవంబర్ లో అందుబాటులోకి ‘భారత్ టాక్సీ’..

పట్టణాలు, నగరాల్లో ప్రయాణాలు చేయాలంటే ఎక్కువ మంది ట్యాక్సీకి ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. నిల్చున చోటుకే వాహనం వచ్చి.. కావాల్సిన చోటకు తీసుకెళ్తారు. ఓలా, ఉబర్ వంటి సంస్థలు ఈ సేవలను అందిస్తున్నాయి. కార్లతో పాటు బైక్ ల ద్వారా ప్రయాణికులను చేరవేరుస్తున్నాయి. అయితే వీటికి ధీటుగా కేంద్ర ప్రభుత్వం ‘భారత్ టాక్సీ’ని అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఇవి కూడా ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. అయితే కమీషన్ లేకుండా డ్రైవర్లు తమ వాహనాలను ఏర్పాటు చేసే అవకాశం ఉండడంతో చాలా మంది డ్రైవర్లకు ఇది ప్రయోజనం కలగనుంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళితె..

భారతదేశ సహకార రంగం లో విప్లవాత్మక మార్పు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం మద్దతుతో త్వరలో ‘భారత్ టాక్సీ’ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త ప్లాట్‌ఫారమ్ సహకార పద్ధతిలో పనిచేస్తుంది, దీని ప్రధాన లక్ష్యం డ్రైవర్లకు మెరుగైన ఆదాయాన్ని, ప్రయాణికులకు నాణ్యమైన, సరసమైన సేవలను అందించడం. భారత్ టాక్సీ సేవలను ‘సహకార్ టాక్సీ కో-ఆపరేటివ్ లిమిటెడ్’ నడుపుతుంది. ఇది ఒక ప్రైవేట్ కంపెనీ కాకుండా సహకార సంస్థగా పనిచేస్తుంది. దీనిలో డ్రైవర్లు కూడా సహ-యజమానులుగా ఉంటారు. ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ క్యాబ్ అగ్రిగేటర్లు డ్రైవర్ల ఆదాయం నుంచి 20-30% వరకు కమీషన్ తీసుకుంటాయి. కానీ, భారత్ టాక్సీలో డ్రైవర్లు తమ రైడ్ ఆదాయం నుంచి ఎలాంటి కమీషన్ చెల్లించాల్సిన అవసరం లేదు. బదులుగా, వారు రోజువారీ, వారపు లేదా నెలవారీ నామమాత్రపు సభ్యత్వ రుసుము చెల్లించాలి. దీనివల్ల డ్రైవర్లకు 100% ఆదాయం లభిస్తుంది.

ఈ సేవలు నవంబర్ నెలలో దేశ రాజధాని ఢిల్లీలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభం కానున్నాయి.మొదటగా 650 మంది వాహన యజమానులు/డ్రైవర్లు సేవలు అందిస్తారు.ఈ ప్రయోగం విజయవంతమైతే, దేశవ్యాప్తంగా విస్తరిస్తారు.డిసెంబర్ నాటికి దేశంలోని ఇతర ప్రధాన నగరాలైన ముంబై, పూణే, భోపాల్, లక్నో, జైపూర్ వంటి 20 నగరాలకు సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పటికి దాదాపు 5,000 మంది డ్రైవర్లు చేరవచ్చని అంచనా.2026 మార్చి నాటికి దేశంలోని ప్రధాన మెట్రో ప్రాంతాలలో కార్యకలాపాలు ప్రారంభించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.2030 నాటికి సుమారు లక్ష మంది డ్రైవర్లను ఈ ప్లాట్‌ఫామ్‌లో భాగస్వాములను చేయాలని యోచిస్తోంది.

కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ , నేషనల్ ఈ-గవర్నెన్స్ డివిజన్ సంయుక్తంగా ఈ సేవను అభివృద్ధి చేశాయి. భారత్ టాక్సీ వేదికగా టూ-వీలర్లు, త్రీ-వీలర్లు (ఆటోలు), ఫోర్-వీలర్ క్యాబ్‌లు వంటి అన్ని రకాల వాహనాలు సేవలు అందించే అవకాశం ఉంది. ఈ ప్లాట్‌ఫారమ్‌ను డిజిలాకర్ , ఉమంగ్ , ఏపీఐ సేతు వంటి జాతీయ డిజిటల్ వేదికలతో అనుసంధానం చేయనున్నారు, తద్వారా సేవలు మరింత సురక్షితంగా అందించబడతాయి.

ప్రైవేట్ క్యాబ్ సంస్థల కమీషన్ల భారం తగ్గడం వల్ల డ్రైవర్లకు వచ్చే ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. సభ్యత్వ రుసుము చెల్లించి పూర్తి ఆదాయాన్ని నిలుపుకోవడం వల్ల వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. సహకార సంస్థలో సహ-యజమానులుగా ఉండటం వలన నిర్ణయాలలో భాగస్వామ్యం లభిస్తుంది. ప్రభుత్వ పర్యవేక్షణలో నడిచే ఈ సేవలు మరింత నాణ్యమైన, సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయని భావిస్తున్నారు. అలాగే, పోటీ పెరగడం వల్ల ఛార్జీలు కూడా ప్రయాణికులకు మరింత సరసమైన ధరల్లో అందుబాటులోకి రావచ్చని అంచనా.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News