Saturday, December 6, 2025

కార్తీక మాసంలో నదీస్నానం చేస్తే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు?

కార్తీక మాసం రాగానే చాలా మంది నదీస్నానం చేయాలని అంటారు. సాధారణ రోజుల్లో కాకుండా కార్తీక మాసంలో చేయడం వల్ల పుణ్యం అని చెబుతారు. అయితే ఈ సమయంలో స్నానం చేయడం వల్ల దేవతల అనుగ్రహం ఉండడమే కాకుండా శారీరకంగా కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పూర్వీకుల ద్వారా తెలుస్తోంది. అసలు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి? నదీ స్నానం ఎప్పుడు చేయడం మంచిది?

శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రం..

భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన మాసాలలో కార్తీక మాసం అగ్రస్థానంలో ఉంటుంది. ఈ మాసంలో ఉదయాన్నే నదీ స్నానం (కార్తీక స్నానం) ఆచరించడం ఒక ముఖ్యమైన ఆచారం. దీని వెనుక కేవలం ఆధ్యాత్మిక కారణాలే కాక, ఆరోగ్యానికి మరియు ప్రకృతికి సంబంధించిన అనేక శాస్త్రీయ రహస్యాలు దాగి ఉన్నాయి. కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైనది . ఈ మాసంలో నదీ స్నానం చేసి శివ, కేశవులను పూజిస్తే మోక్షం లభిస్తుందని, తెలియక చేసిన పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో గంగా, యమునా, సరస్వతి వంటి పవిత్ర నదులన్నీ ఇతర నదులు, చెరువులు, బావులలోకి ప్రవేశిస్తాయని, అందుకే అన్ని జలాలకు కార్తీకంలో గంగా స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. నదీ స్నానం తర్వాత దీపాలను వెలిగించి నదిలో వదలడం (దీప దానం) వల్ల సంతోషం, సంపద కలుగుతాయని విశ్వాసం.

స్వచ్ఛమైన నీరు..

అయితే కార్తీక మాసంలో నదీ స్నానం చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢమాసం ప్రారంభం నుంచి అశ్వయుజ మాసం వరకు వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో నదులలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. అప్పటి వరకు అపరిశుభ్రంగా ఉన్న నీరు కార్తీక మాసంలో చెత్తా చెదారం తొలగిపోయి స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తుంది. అందుకే ఈ సమయంలో నదీ స్నానం చేయడం వల్ల శరీరానికి ఆరోగ్యకరం అని అంటారు. ఈ మాసంలో సాధారణంగా చలి పెరుగుతుంది. అయితే ఉదయాన్నే చల్లటి నదీజలాలలో స్నానం చేయడం వల్ల శరీరం చలికి అలవాటుపడి, రోగనిరోధక శక్తి (Immunity) పెరుగుతుంది. బద్ధకం వదిలి రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

నదీపై చంద్రుడి కిరణాలు..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కార్తీక మాసంలో చంద్రుడు అత్యంత శక్తివంతంగా ప్రకాశిస్తాడు. ఈ మాసాన్ని కౌముది మాసం అనికూడా అంటారు. రాత్రి సమయంలో చంద్రుడి కిరణాలు నదీపై పడుతాయి. దీంతో నదీజలాలు ఆ ప్రత్యేక శక్తిని (ఎలక్ట్రో మాగ్నెటిక్ పవర్) పుంజుకుంటాయి. ఉదయం సూర్యోదయానికి ముందు ఆ నీటిలో స్నానం చేయడం వల్ల ఆ శక్తి శరీరంలోకి ప్రవేశించి ఆరోగ్యాన్ని స్థిరంగా ఉంచుతుందని నమ్ముతారు. నదీ స్నానం కోసం ఉదయాన్నే లేచి నది వద్దకు నడవడం ఒక రకమైన తేలికపాటి వ్యాయామం అవుతుంది.అలాగే నదుల్లో ప్రవహించే నీరు పర్వతాలు, కొండల మీదుగా, రాళ్లను, రకరకాల ఔషధ మొక్కలు, మూలికల వేర్లను తాకుతూ వస్తుంది. ఈ క్రమంలో, ఆ ఖనిజాలు, మూలికల సారాన్ని తనలో కలుపుకొని వస్తుంది. అందుకే నదీజలాలలో సహజ సిద్ధమైన ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. ఈ నీటిలో స్నానం చేయడం చర్మ వ్యాధులు, జీర్ణవ్యవస్థ వంటి సాధారణ రుగ్మతలకు మంచిదని నమ్మకం. చల్లటి నీటిలో స్నానం చేయడం వల్ల శరీరం ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తుంది. దీనివల్ల రక్త ప్రసరణ (Blood Circulation) మెరుగుపడి, రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది.ఉదయం ప్రశాంతమైన వాతావరణంలో, నదీతీరంలో స్నానం చేయడం మానసిక ప్రశాంతతను, ఉల్లాసాన్ని కలిగిస్తుంది.

నదీస్నానం ఎప్పుడు చేయాలి?

కార్తీక మాసంలో నదీ స్నానం ఆచరించడానికి ఉత్తమ సమయం బ్రాహ్మీ ముహూర్తం (సూర్యోదయానికి ముందు). సూర్యుడు ఉదయించకముందే, ఆకాశంలో ఇంకా నక్షత్రాలు కనిపిస్తుండగానే (సుమారు తెల్లవారుజామున 4:30 నుండి 5:30 మధ్య) స్నానం ఆచరించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. సూర్యోదయానికి ముందు నీరు భూమి నుంచి వెలువడే విద్యుదయస్కాంత శక్తిని ఎక్కువగా నిల్వ చేసుకుని ఉంటుందని, ఆ సమయంలో స్నానం చేయడం వల్ల ఆ శక్తిని శరీరం గ్రహిస్తుందని శాస్త్రీయంగా కూడా నమ్ముతారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News