వైద్యో నారాయణ హరి.. అని అంటారు. ఒక ప్రాణం పోయడానికి వైద్యులు ఎంతో శ్రమిస్తారు. ఎన్ని పనులు ఉన్నా కొన్ని అత్యవసర పరిస్థితుల్లో తమ పనులను వదులుకొని ఆస్పత్రులకు వస్తారు. అలాగే తాజాగా ఒక మహిళ డాక్టర్ కూడా అలాగే చేసింది. ఒక బిడ్డకు ప్రాణం పోయడానికి తనకున్న అత్యవసర పనిని వదిలి ఆసుపత్రికి వచ్చి ఆపరేషన్ చేసింది.
దీపావళి పండుగ సందర్భంగా అందరూ సంబరాల్లో మునిగిపోయారు. కుటుంబ సభ్యులతో లక్ష్మీ పూజలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అఖిల అనే గైనకాలజిస్ట్ డాక్టర్ సైతం తమ కుటుంబ సభ్యులతో కలిసి పూజలో పాల్గొన్నారు. అయితే ఇంతలో ఆమెకు ఆస్పత్రి నుంచి అత్యవసర ఫోన్ వచ్చింది. ఆస్పత్రిలో ఉన్న ఒక గర్భిణీకి పిండంలో కదలికలు లేవనే విషయం తెలిసింది. అయితే దీపావళి సందర్భంగా ఆస్పత్రిలో ఎవరూ లేరు.
దీంతో ఏమాత్రం ఆలోచించకుండా డాక్టర్ అఖిల వెంటనే ఆసుపత్రికి తరలివచ్చారు. ఆపరేషన్ చేసి ఒక బిడ్డకు ప్రాణం పోశారు. అయితే చాలామంది పవిత్రంగా భావించే దీపావళి పూజలు విడిచి పెట్టడానికి ఇష్టపడరు. కానీ డాక్టర్ అఖిల మాత్రం అత్యవసర పరిస్థితిని అర్థం చేసుకొని వెంటనే ఆసుపత్రికి వచ్చి ఆపరేషన్ చేసింది. ఈ సందర్భంగా ఆమె “మా ఇంట్లో మహాలక్ష్మిని వదిలినా.. ఇక్కడ మరో మహాలక్ష్మికి ప్రాణం పోశా.. హ్యపీ దీపావళి”అంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ సందర్భంగా ఆమెను అందరు ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా నిస్వార్ధంగా ఇలాంటి సేవలు చేసే వైద్యులకు సలాం అంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.





