సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో కొత్త అల్లుళ్లను ఇంటికి ఆహ్వానిస్తారు. వారిని విందు, వినోదాలతో సంతోషంగా ఉంచుతారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఏమాత్రం మర్యాద తగ్గకుండా అల్లుళ్లకు రుచికరమైన వంటకాలను అందిస్తారు.ఈ వంటకాల ఒక్కోసారి వందకు పైగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ సంస్కృతి తెలంగాణలోనూ కొనసాగుతోంది. తెలంగాణలో అతి ముఖ్యమైన పండుగ సందర్భంగా ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి ఓ కుటుంబం 101 వంటకాలతో విందును ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈ వంటకంలో ఓ బహుమతిని కూడా ఏర్పాట చేశారు. మరి ఈ ఆసక్తికరమైన సంఘటన ఎక్కడ జరిగిందంటే?
వనపర్తి జిల్లా, కొత్తకోట పట్టణానికి చెందిన గుంత సురేష్, సహన దంపతులు తమ కుమార్తె సింధును, వరంగల్‌కు చెందిన నికిత్ అనే అబ్బాయికి ఇచ్చి రెండు నెలల క్రితం వివాహం చేశారు. పెళ్లి తర్వాత వచ్చిన మొదటి పెద్ద పండుగ దసరా కావడంతో, తమ కొత్త అల్లుడికి ఘనంగా మర్యాదలు చేయాలనుకున్నారు.గోదావరి జిల్లాల సంస్కృతికి ఏమాత్రం తగ్గకుండా, అల్లుడు నికిత్‌కి ఏకంగా 101 రకాల పసందైన శాఖాహార వంటకాలతో కూడిన విందు భోజనాన్ని అత్తమామలు సిద్ధం చేశారు.వంటకాలు సిద్ధం చేసి, అల్లుడికి అరటి ఆకులో విందు భోజనం వడ్డించారు. అంత పెద్ద విస్తరి, రకరకాల వంటకాలు చూసి అల్లుడు నికిత్ ఆశ్చర్యపోయాడు.
ఈ సందర్భంలో, నికిత్ సరదాగా తన అత్తమామలను ఒక ప్రశ్న అడిగాడు.. ‘మీరు 101 రకాల వంటకాలు అంటున్నారు కదా, ఇందులో ఒక్క వంటకం తక్కువైందని నిరూపిస్తే నాకు ఏమి ఇస్తారు?’ తనపై తమ అల్లుడు చమత్కరించాడని భావించిన అత్తమామలు, తాము 101 రకాల వంటకాలు సిద్ధం చేశామనే పూర్తి ధీమాతో ‘ఒక్క వంటకం తగ్గినా సరే, మాట ప్రకారం తులం బంగారం ఇస్తాం!’ అని బదులిచ్చారు. అత్తమామల మాటతో నికిత్ చాలెంజ్‌గా తీసుకున్నాడు. విస్తరిలో ఉన్న వంటకాలను ఒకటికి రెండుసార్లు లెక్కించి చూశాడు. లెక్కించగా, విస్తరిలో సరిగ్గా 100 రకాల వంటకాలు మాత్రమే ఉన్నాయి. అంటే, అత్తమామలు అనుకున్న 101 రకాలలో ఒక వంటకం తగ్గింది.
తాము మాట ఇచ్చిన ప్రకారం, కొత్త అల్లుడు నికిత్‌కు గుంత సురేష్, సహన దంపతులు సంతోషంగా తులం బంగారం బహుమతిగా ఇచ్చారు. అద్భుతమైన విందు భోజనం ఆరగించడమే కాకుండా, మాట నిలబెట్టుకున్న అత్తమామల నుండి విలువైన బహుమతి కూడా దక్కించుకున్న కొత్త అల్లుడికి దసరా పండుగ మరింత ప్రత్యేకంగా నిలిచింది.ఈ సరదా సంఘటనను కుటుంబ సభ్యులు వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకోగా, అది వైరల్ అయింది. అల్లుడి తెలివి, అత్తమామల ప్రేమ, మాట నిలబెట్టుకున్న తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.





