తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) తన సొంత నివాసమైన ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో విజయదశమి పండుగ సందర్భంగా ఆయుధ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ పూజా కార్యక్రమంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులతో పాటు ఇతర కుటుంబసభ్యులు, ముఖ్య సిబ్బంది పాల్గొన్నారు. దసరా పండుగను పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ దంపతులు దుర్గామాతకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు కేసీఆర్ కుటుంబంతో ప్రత్యేకంగా ఆయుధ పూజ చేయించారు. ఈ సందర్భంగా కేసీఆర్ తన నివాసంలోని వాహనాలు, ఇతర వస్తువులకు పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, అష్టైశ్వర్యాలతో కలకాలం జీవించాలని దుర్గామాతను ప్రార్థించినట్లు సమాచారం.





