తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండుగలు దసరా, సంక్రాంతి. అయితే తెలంగాణలో దసరా పండుగకు ముందు బతుకమ్మను నిర్వహించుకుంటారు. తొమ్మిదిరోజుల పాటు మహిళలు బతుకమ్మ వేడకల్లో పాల్గొంటారు. అయితే బతుకమ్మ పండుగ చరిత్ర, పుట్టుక గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ’బతుకమ్మ‘ అంటే ‘తల్లి, బతికిరా!’ లేదా ‘తల్లీ, జీవించు’ అని అర్థం. ఈ పండుగ తెలంగాణ సంస్కృతికి, ప్రకృతికి ప్రతీకగా నిలుస్తుంది.
బతుకమ్మ చరిత్ర
బతుకమ్మ పండుగ శతాబ్దాల చరిత్రన కలిగి ఉంది, ముఖ్యంగా కాకతీయ చక్రవర్తుల కాలం (12వ శతాబ్దం) నుంచీ ఇది ప్రబలంగా ఉన్నట్లు కొన్ని ఆధారాలు చెబుతున్నాయి.
బతుకమ్మగా జన్మించిన లక్ష్మీదేవి కథ
దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళ వంశపు రాజు ధర్మాంగదుడు- రాణి సత్యవతికి చాలా సంవత్సరాలు పిల్లలు లేరు. వారు చేసిన పూజల ఫలితంగా వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ పాప అనేక ప్రమాదాల నుంచి బయటపడింది. దాంతో తల్లిదండ్రులు, బిడ్డా, ‘బతుకమ్మ’ అని దీవించి ఆమెకు బతుకమ్మ అనే పేరు పెట్టారు. అప్పటి నుండి, బతుకమ్మను పూలతో అలంకరించి, ఆమెను పూజిస్తే తమ బిడ్డలు లేదా తాము నిండు నూరేళ్లు సుఖంగా బతుకుతారని నమ్ముతున్నారు.
గౌరీదేవి (పార్వతి) నిద్ర కథ
మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన తర్వాత, గౌరీదేవి (దుర్గాదేవి) బాగా అలసిపోయి, అశ్వయుజ పాడ్యమి నాడు నిద్రలోకి వెళ్ళిపోతుంది. దేవతలు, భక్తులు ఆ తల్లిని మేల్కొలపడానికి వివిధ రకాల ఔషధ గుణాలున్న పూలతో పూజించారు. వారి ప్రార్థనలు విని, ఆమె దశమి రోజున తిరిగి మేల్కొంది. అప్పటినుంచి, ప్రకృతిలో దొరికే పూలతో బతుకమ్మను పేర్చి, ఆమెను పూజిస్తే జీవశక్తి తిరిగి వస్తుందని నమ్ముతారు.
సతీదేవి పునర్జన్మ కథ
దక్షయజ్ఞంలో అవమానం పాలైన సతీదేవి అగ్నిలో ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆమె తిరిగి పార్వతి రూపంలో జన్మించాలని కోరుతూ, స్త్రీలు పూలతో బతుకమ్మను పేర్చి, ఆమెను మేల్కొలపడానికి ప్రార్థిస్తూ పాటలు పాడతారు. ‘బతుకమ్మా’ అంటే ‘తల్లీ, మళ్లీ బతికిరా’ అని అర్థం.
బృహదమ్మ (పార్వతి) సాంత్వన కథ
తెలంగాణలోని వేములవాడ రాజరాజేశ్వరాలయంలోని భారీ శివలింగాన్ని చోళ రాజులు తీసుకువెళ్ళినప్పుడు, అక్కడి బృహదమ్మ (పార్వతీదేవి) దుఃఖించిందని, ఆ తల్లికి సాంత్వన (ఓదార్పు) కలిగించడానికి, అక్కడి ప్రజలు శివలింగాకృతిలో రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి, ఆటపాటలతో పూజించారని, కాలక్రమేణా ఆ బృహదమ్మ అనే పేరే బతుకమ్మగా మారిందని మరొక కథనం ఉంది.





